తిరగని ప్రగతి రథ చక్రాలు

– రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె
– బలవంతంగా బస్సులు నడిపేందుకు పోలీసుల యత్నాలు
– పలుచోట్ల కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– ఇష్టారాజ్యంగా దండుకుంటున్న ప్రైవేట్ వాహనాలు
– అవస్థలు పడుతున్న ప్రజలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజు కూడా కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు అవస్థలుపడుతున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. పోలీసుల పహారాలో బస్సుకు ఒక కానిస్టేబుల్‌ను పెట్టి బలవంతంగా బస్సులను నడపాలని చూస్తున్నది. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు తెల్లవారుజాము నుంచే బస్సుల వద్దకు చేరి ఒక్క బస్సును కూడా కదలనీయలేదు. పోలీసులు కార్మికులను అరెస్టు చేసినా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండగా వారు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక ధరలు చెల్లించి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. మెదక్ ఆర్టీసీ డిపో నుంచి తెల్లవారుజామున బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆర్టీసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య బస్సులు నడిపేందుకు డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సులు తీసుకురాగా కార్మికులు సమాచారం తెలుసుకుని భారీ సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 600  బస్సులు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్నది. కామరెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల టెంట్‌ను పోలీసులు తొలగించడంతో వివాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బస్సులు రెండో రోజూ డిపోలకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో బస్సులు నడపాలని చూడగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. తొర్రూరు డిపో వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. విధులకు రాని 21 మందిపై కేసు నమోదు చేశారు. సమ్మెలో పాల్గొనేందుకు డిపో వద్దకు వస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను అరెస్టు చేసి కేసులు నమోదు చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అద్దె బస్సులు నడిపేందుకు యత్నం
సమ్మెను విచ్చిన్నం చేయొద్దని వేడుకున్న కార్మికుడు

జనగామ : జనగామ జిల్లాలో నిరసనకు దిగిన ఆర్టీసీ కార్మికులను అడ్డుకోవద్దంటూ ఓ ఆర్టీసీ కార్మికుడు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న సంఘటన ప్రతి ఒక్కరినీ కదలించింది. సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ డిపో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపో నుండి బస్సుకు ఒక కానిస్టేబుల్‌ను పెట్టి వివిధ ప్రాంతాలకు బస్సులను పంపిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన తమను అడ్డుకోవద్దంటూ ఓ కార్మికుడు పోలీసుల కాళ్లు మొక్కి వేడుకున్నాడు. కాగా, డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె ఆపేదే లేదని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

పెట్రోల్ పోసుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

వరంగల్: ఆర్టీసీ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి దిగిన ఆర్టీసీ కార్మికులు రెండో రోజు అన్ని డిపోల ఎదుట మహా ధర్నాకు దిగారు. ఇందులో భాగంగా నర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవర్ కోలా రమేశ్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సహచర కార్మికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘ‌ట‌న‌తో న‌ర్సంపేట‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *