తెలంగాణ హామీలు,ఆంధ్రకు ప్రత్యేక హోదా గతి ఏమిటి?

‘‘ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి తెలుగు వారు సమైక్యం కావడానికి కృషి చేయాలని జనధర్మలో 43 ఏళ్ల కిందట 1989 సంపాదకీయంలో ఆచార్య రాసిన అంశాలు. విచిత్రమేమంటే 2014లో పార్లమెంట్‌ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చట్టాలలో అనేకానేక విషయాలు అమలు చేయడం లేదు. పార్లమెంట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రాచలం పరిసరాల్లో ఏడు గ్రామాలను అన్యాయంగా ఆంధ్రకు చేర్చడం, అదేవిధంగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ కు కూడా స్పెషల్‌ హోదాను వదిలేయడం కూడా కేంద్రం చేసిన అన్యాయమే..’’

జనధర్మో విజయతే

వరంగల్‌ అంటే పత్రికలకు అడ్డా. హైదరాబాద్‌ లో ఒకటి రెండు పత్రికలు కాకుండా, విజయవాడ నుంచి మద్రాస్‌ నుంచి మాత్రమే పంపేవారు. అప్పట్లో ఆంధ్రపత్రిక చాలా గొప్ప పత్రిక. అప్పుడు వరంగల్‌ జిల్లా ఆంధ్రపత్రికే ఉద్యమానికి ఊపిరి, అక్కడ ఏజెంట్‌ గా నిలబ డడమే గొప్ప అనుకునే రోజులు. యం యస్‌ ఆచార్య జీవనం ఆంధ్రపత్రిక ఏజెంట్‌, అక్కడినుంచే పత్రికా రచన ప్రారంభించి,  సంపాదకుడుగా ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది.

ఆయుధం కలం, సరిగ్గా 100 ఏళ్ల కిందట ఈరోజున అంటే అక్టోబర్‌ 3న జన్మించిన ఎం ఎస్‌ ఆచార్య, తెలుగు మాట్లాడితే నేరంగా పరిగణించే నిజాం పాలనలో తెలుగు పత్రికకు వార్తలు రాసే విలేకరిగా పనిచేసినాడు.   వార్తలున్న ఆ పత్రికను రహస్యంగా పంచిపెట్టేవాడు. అదే ఆయన ఉద్యమం ఉద్యోగం, జీవనం, జీవనభృతి కూడా, రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాలీ  చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దేశం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి, నెల్లికుదురు గ్రామంలో తండ్రి ప్రసన్న రాఘవాచార్య దగ్గరికి వైద్యం కోసం వచ్చిన ఆజాత విప్లవ వీరుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు జీవితం తనకు స్ఫూర్తి అని చెప్పినారు.

వావిలాల గోపాలకృష్ణయ్య తెనాలిలో స్వాతంత్య్రానికి పూర్వం నిర్వహించిన జర్నలిజం శిక్షణా శిబిరంలో పాత్రికేయ వృత్తి మెలకువలు నేర్చుకున్నారాయన. ఆయన ఆరంభించిన అక్షర సంగ్రామమే ఆచార్య చేత ఆ తరువాత జనధర్మ వారపత్రిక ప్రారంభింపజేసింది. ముప్ఫై ఏళ్ల తరువాత వరంగల్‌ వాణి దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు. కలం ఆగిన తరువాత జులై 12, 1994న ఆయన ఊపిరి ఆగిపోయింది.

 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమపోరాటం
image.png
తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాలే దాదాపు అన్నీ ఆంధ్రప్రాంత వారివే. యం యస్‌ ఆచార్య రాసిన సంపాద కీయంలో ఘాటైన వాక్యాలు  ఇవి చదవండి. తెలంగాణ మీద, తెలం గాణా ప్రాంతంలో నివసించే ఉద్యో గుల మీద అమితమైన బాధ్యత లున్నాయి. ఉభయ ప్రాంతాల ప్రజల మధ్య రెచ్చిపోయిన విద్వేషానలాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? నాయకుల్ని జైల్లో వేయడం ఆంధ్రుల ఇళ్లకు సాయుధ పోలీసులు కాపలా కాయడం వంటి చర్య విద్వేషం నిర్మూలనకూ విశ్వాసం నెలకొల్పుటకు గాక మరింత ద్వేషానికే కారణం కావడం లేదా? పైగా ఇటీవల మంత్రి పదవులను అలంకరించిన వారి ప్రసంగాలు జనాన్ని కవ్వించేదిగానే ఉంటున్నా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రిబాధ్యతలు నిర్వహించిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి వంటి తెలంగాణా నాయకుడు, ఇటువంటి విచక్షణా రహితమైన దమనకాండను సాగించే పోలీసు వారిపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోగలదని ప్రకటించవలసి వచ్చిందంటే పోలీసుల హింసాకాండ ఏ స్థాయికి చేరుకున్నదో చెప్పనక్కరలేదు…..
(జనధర్మ సంపాదకీయం, తేదీ ఆగస్టు 15, 1989, ఎం ఎస్‌ ఆచార్య సంపాదకీయాలు పుస్తకం పేజీ 140, 141 నుంచి) తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాది ఉద్యమకారుల మీద లాఠీలు, బాష్పవాయుగోళాలు, ఫిరంగులు కురిపించి తెలంగాణ ఎంపీలను సైతం అరెస్టు చేసిన సందర్భంలో ఆగస్టు 15, 1968 నాడు జనధర్మ రాసిన వాక్యాలు చదవాలి. వరంగల్‌ తెలంగాణ గొంతుక వినిపించిన జనధర్మలో సంపాదకుడు ఎం.ఎస్‌. ఆచార్య విసిరిన బాణాలు, అప్పుడూ రాజకీయ నాయకులు ఇవే మాటలు మాట్లాడారు. వారి కింద పని చేసిన పోలీసులు ఇదే రకంగా ఉద్యమ నాయకుల మీద అణచివేతలు అరెస్టులు కుట్రలు సాగించారని ఆయన సంపాదకీయం వివరిస్తుంది.
తెలంగాణా ఉద్యోగులకు దశాబ్దాలుగా అన్యాయాలేనా?
తెలంగాణాకు ఇవ్వబడిన రక్షణలలో ముల్కీలకు నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల రిజర్వు ఒకటి. ఇందుకోసం ముల్కీ రూల్స్‌ అమలుకు వచ్చాయి. ముల్కీలకు రిజర్వు చేయబడిన ఉద్యోగులలో 10 శాతం మంది నాన్‌ ముల్కీలు, దొంగ ముల్కీలు నియామకమైనా 10 శాతం రూల్స్‌ ప్రకారం ముల్కీలకు లభించాయి. 12 సంవత్సరాలుగా లభిస్తున్నాయి. ఈ నాన్‌ ముల్కీల స్థానే ముల్కీలకే రావాలని ఆందోళన చేయగా ప్రభుత్వం ప్రతిపక్షాలు అంగీకరించాయి. ముల్కీ రూల్సు రాజ్యాంగ విరుద్ధమనే కోర్టు తీర్పును ఆంధ్ర ఉద్యోగులు పొందారు. ఏ ముల్కీ రూల్స్‌ ప్రకారం తమకు ఉద్యోగాల విషయములో రక్షణ ఉన్నదని ప్రాంతీయులు నమ్మారో అవి రాజ్యాంగ విరుద్ధమైనవైతే గత 12 సంవత్సరాలుగా అవి అమలులో ఎట్లా ఉన్నాయి. ఈ 12 సంవత్సరాలలో ఏ ఆంధ్ర ఉద్యోగి కూడా కోర్టుకు వెళ్లలేదేమి? ముల్కీ నిబంధనలు 1964లో తిరిగి అయిదేళ్ల కాలం పొడిగించినప్పుడైనా కోర్టుకు వెళ్లలేదేమి? రక్షణలు ఒకవైపున ఉన్నా దొడ్డిదారిన ఉద్యోగాలు తమకు లభింపజేసినంత కాలం వీరు కోర్టుకు వెళ్లలేదా? ఈ రహస్యం బట్టబయలై ప్రజాందోళన ప్రారంభమై ప్రభుత్వం తానే నాన్‌ ముల్కీలను ఖాలీ  చేయించే స్థితి వచ్చినపుడు కోర్టుకు వెళ్లారా? ఇదంతా తమను మోసగించడానికే అనే దృతాభిప్రాయం ప్రజలకు ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు అని జనధర్మ సంపాదకీయం ఘాటుగా రాసారు.
తమకు అనుకూలంగా సాగినంత కాలం ఒప్పందాలను బతకనీయడం. ఒప్పందం అసలు ప్రయోజనాలు అమలు కాకతప్పదన్నప్పుడు కోర్టుకు వెళ్లి ఒప్పందం రాజ్యాంగ విరుద్ధం అని తీర్చు పొందడం పైన జనధర్మ లేవనెత్తిన ప్రశ్నలు ఇవి. రాజ్యాంగ విరుద్ధమైతే ముల్కీ ఇన్నాళ్లు ఏ విధంగా అమలైందని  ఆచార్య నిలదీసారు. ఈనాటికీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఆ మోసాలకు అంతులేదు. ఇక్కడి ఉద్యోగులు, జనం అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. కొందరు కుహనా మేధావులు అవాస్తవాలను పుట్టించి వాటిని తమకు అనుగుణంగా అన్వయిస్తూ బలీయమైన తెలంగాణవాదాన్ని మోసంతో ఎదుర్కొనే ప్రయత్నం ఈనాడు కూడా అదే ధోరణిలో కొనసాగిస్తూనే ఉన్నారు. ముల్కీ ఒప్పందం ఎన్ని రూపాలు మారినా ఎన్ని కోర్టు మెట్లు ఎక్కి దిగినా మోసం రూపంలో మార్పు లేదు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయాల విషయంలో అంతులేదు ద్రోహాలు అపనమ్మకాలు ఉన్నాయి.  ఆంధ్ర తెలంగాణా మధ్య ఏర్పడిన ఈ అగాధాన్ని ఈ మానసిక అనారోగ్యాన్ని తొలగించడానికి చేయవలసిన ప్రయత్నం ఏదీ ప్రభు త్వం గానీ, నాయకులు గానీ చేయడం లేదు. ప్రజల్లో విశ్వాస పునరుద్ధరణ జరగనిదే ఏదీ పొసగదు. నాయకులను జైళ్లలో పెట్టినంత మాత్రాన ఉద్యమాందోళన పోదు. సంస్కృతీ సమైక్యతలకు సంబంధించిన సూత్రాలు ఎంత గొప్పనైనా ఉన్నతమైనవైనా వాటి చాటున తమకు ద్రోహం తలపెట్టబడిరదని నమ్మకం కలిగిన తరువాత ఉపయోగకరం కాజాలవు. అని జనధర్మ సంపాదకీయంలో వివరించారు.
ప్రశాంతంగా సాగుతున్న మార్చ్‌ మీద నెత్తుటి మరకలు పూసింది కవాతులో జొరబడిన సీమాంధ్రకు చెందిన ద్రోహులని మఫ్టీలో ఉన్న పోలీసులే పాత్రికేయుల వాహనాలను కూడా తగులబెట్టారని అప్పట్లో విమర్శించారు. ఈ వ్యవహారాలపైన విచారణ జరగాలి. ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకున్న ఈ అపనమ్మకాన్ని దూరం చేసే ప్రయత్నం చేయడం మాట అటుంచి అనుమానాలు మరింత పెంచే పనులే జరగడం 1969లోనే కాదు 43 ఏళ్ల తరువాత ఈ రోజూ జరుగుతూ ఉండడం ఈ నాటి తరం ఉద్యమకారులు, ఉద్యమనేతలు, వారిపైన నమ్మకం ఉంచి ఇంకా ఆశలు పెంచుకుంటున్న తెలంగాణ నాయకులు గమనించవలసిన కీలకమైన అంశం అని ఎం.ఎస్‌. ఆచార్య ఆనాడు రాసిన సంపాదకీయం ఈనాటి పరిణామాల నేపథ్యంలో హెచ్చరిస్తున్నది.
సమైక్యత అంటే ఇదేనా?
ప్రభుత్వం సమస్త సాయుధ పోలీసు బలగం అండన ఉన్నా తమకు రక్షణ లేదనే భీతాహంలో ఆంధ్ర కుటుంబాలవారు పడి పోయినప్పుడు, ఆంధ్ర ప్రాంతపు జైళ్లలో తెలంగాణా నాయకులపై ఘోరాలు జరగవచ్చుననీ, చదవవలసి విద్యార్థులకు ఆంధ్ర ప్రాంతము కళాశాలల పాఠశాలల్లో ఉస్మానియా విశ్వ విద్యాలయాధికారులు ఏర్పాటు చేసినప్పడికీ తమ పిల్లలకు అపాయము కలుగుతుందని ఇక్కడి ప్రజలు భీతాహపడటంలో వింత ఏమీ లేదు. రాష్ట్రపతి పాలనను విధించడం, 1950 ఒప్పందం అనుసరించి ఇవ్వబడిన రక్షణలను అన్నింటినీ అమలు చేయడం, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలా వద్దా అనేది రిఫరెండం పెట్టటం వంటి చర్యలే ప్రజా విశ్వాస పునరుద్ధరణకు దోహదం చేస్తాయి. రాష్ట్ర సమైక్యతకు పటిష్ట రూపం ఏర్పడి సుస్థిరము కావడమో లేక రెండు తెలుగు భాషా రాష్ట్రాలు ఏర్పడి ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య సుహృద్భావ సంబంధంలు సుదృడం అవటమో ఇందువల్ల జరుగుతుంది. రిఫరెండం మొదటి ఫలితాన్నిదైనా సరేసరి. లేక రెండో ఫలితమే అయితే సుహృద్భావ సంబంధాలు సుదృడమయిన తరువాత కొంత కాలానికి రెండు తెలుగు రాష్ట్రాలు శాశ్వతముగా సమైక్యం కాగల వీలయినా కలుగు తుంది అని జనధర్మ సంపాదకీయం వివరించింది.
ఆనాటి అసహనం, తీవ్రద్వేషం ఈనాటికీ అంతే తీవ్రంగా ఉన్నాయా? ఇంకా పెరిగాయేమో అనిపిస్తుంది. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీని మూయించాలని సెప్టెంబర్‌ 30 రాత్రి ఒక కాంగ్రెస్‌ ఎంపీ (విజయవాడ) అగ్రహోదగ్రులై మాట్లాడడమేమిటి అని మలి దశ తెలంగాణ ఉద్యమనాయకుడు ప్రొఫెసర్‌ కోదండ్‌ రాం విమర్శించారు. ప్రశాంతంగా రాజకీయపు పైపూతలు లేకుండా స్వచ్ఛంగా అహింసాయుతంగా లక్షల మందిని నడిపిన నాయకుడు కుసంస్కారం అంటూ ఆ ఎంపీ వ్యాఖ్యానించడం తీవ్రమైన అసహనానికి ప్రతీక. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తెలంగాణ కోరితే తప్పా? అక్కడి నుంచి మార్చు  బయలుదేరడమే నేరమా? అందుకు లాఠీ ఛార్జిలు. రబ్బర్‌ బుల్లెట్లు ఎదుర్కోవాలా? తెలంగాణ కావాలంటే తప్పయితే దాన్ని వ్యతిరేకించడం కూడా తప్పు కాకుండా పోతుందా? ఆ తప్పు చేసిన విద్యార్థులున్న  విశ్వవిద్యాలయాలను కూడా మూసివే యమంటారా? తెలంగాణ.
ఇస్తామని అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మూసేస్తారేమో ఎంపీ గారు వివరిం చాలి?  మరొక వైపు యంత్రాంగం టివి ప్రసారాలు నిలిపివేయడం, సాంకేతిక సాకులు చూపుతూ రైళ్లు రద్దు చేయడం, అరెస్టులు చేయడం, మార్చు  వెళ్లవలసిన దారిలో బారికేడ్లు, ముళ్లకంచెలు కట్టడం ఇవన్నీ ఉద్యమం పట్ల రాజకీయ వ్యతిరేకతనే కాకుండా ద్వేషాన్ని కురిపించే పనులు. ఈ మాటలు వినిపించినంత కాలం, ఈ పనులు జరుగుతున్నంత కాలం, రాష్ట్రంలో సమైక్యత లేదని స్పష్టమవుతున్నది. లేని సమైక్యత ఒక భ్రాంతిగా మిగిలిపోయింది అనే విషయం కేంద్రం గుర్తించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి తెలుగు వారు సమైక్యం కావడానికి కృషి చేయాలని జనధర్మలో 43 ఏళ్ల కిందట 1989 సంపాదకీయంలో ఆచార్య రాసిన అంశాలు.
విచిత్రమేమంటే 2014లో పార్లమెంట్‌ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చట్టాలలో అనేకానేక విషయాలు అమలు చేయడం లేదు. పార్లమెంట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రాచలం పరిసరాల్లో ఏడు గ్రామాలను అన్యాయంగా ఆంధ్రకు చేర్చడం, అదేవిధంగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ కు కూడా స్పెషల్‌ హోదాను వదిలేయడం కూడా కేంద్రం చేసిన అన్యాయమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page