హైదరాబాద్‌ ‌జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌ను పునరుద్ధరించండి..

ఒకప్పుడు గొప్ప సంస్కృతికి నిలయంగా, విద్యా కేంద్రంగా పేరు గాంచిన హైదరాబాద్‌, ఇప్పుడు తన అత్యంత ప్రియమైన సంస్థలలో ఒకటి అయిన జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌నిశ్శబ్దంగా నశించడాన్ని చూస్తోంది. నాంపల్లిలోని పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌మధ్యలో ఉండే ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని దశాబ్దాల క్రితం భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఈ సంస్థ చాలా ఏళ్లుగా మూతపడిన పరిస్థితిలో ఉంది. గతంలోనూ, వర్తమానంలోనూ వొచ్చిన తెలంగాణ ప్రభుత్వాలు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహ రించాయి. పిల్లల సృజనాత్మకత, విద్యకు కేంద్రంగా వెలుగొందిన ఈ సంస్తను మళ్లీ ఉజ్వలంగా చూడాలన్న ఆశతోనే, నేను మహమ్మద్‌ ఆబిద్‌ అలీ, హైదరాబాద్‌కి చెందిన ఒక పర్యావరణ, సామాజిక కార్యకర్తగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.

భారతదేశపు మొట్టమొదటి ప్రధాని.. పిల్లలపై ప్రగాఢమైన ప్రేమను కలిగిన పండిట్‌ ‌జవహర్‌లాల్‌ ‌నెహ్రూ పేరుమీద ఏర్పాటు చేసిన ఈ జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌.. ‌పిల్లలు తమ ప్రతిభను, ఊహాశక్తిని పెంచుకునేలా ఒక మెరుగైన భవిష్యత్తు కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే ఆశ్రయంగా రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా ఇటువంటి కేంద్రాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. కళ, విజ్ఞానం, ఆవిష్కరణల ద్వారా పిల్లలలో లోతైన అభివృద్ధిని తీసుకువస్తున్నాయి. కానీ, తెలంగాణ మాత్రం దీనికి ఒక బాధాకరమైన మినహాయింపు. రాజకీయ నాయకత్వం, అనుభవజ్ఞులైన సలహా కమిటీ ఉన్నప్పటికీ, ఇప్పటికీ చర్య తీసుకోలేదంటే ఇది బాధాకరమైన సంగతే. హైదరాబాద్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌తలుపులు ఇప్పటికీ మూసివుండగా, దాని సామర్థ్యం మూగబోయింది. పిల్లలపై ఉన్న ఆశలు గాలిలో కలిసిపోయాయి.

ఇది కేవలం ఒక స్థానిక సమస్య కాదు.. ఇది జాతీయ స్థాయిలో ఒక విషాదకరమైన పరిణామం. పిల్లల పట్ల ప్రేమను ‘‘బేటీ బచావో, బేటీ పడావో’’ వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ప్రదర్శించిన మోదీ నాయకత్వం, వొచ్చే తరం కోసం పెట్టుబడి పెట్టాలంటే ఎలా చేయాలో ప్రపంచానికి చూపింది. ఆయన కలలలోని అభివృద్ధి చెందిన భారతదేశం, పిల్లల సమగ్ర అభివృద్ధిపై ఆధారపడినదే. ఆ దృష్టిని పరిగణలోకి తీసుకుంటే, హైదరాబాద్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌పునరుద్ధరణలో ఆయన జోక్యం అత్యంత కీలకం. దీని పునరుద్ధణ పూర్తయితే  అన్ని వర్గాల పిల్లలకు ఒక ఆశాకిరణంగా మారుతుంది. వారికి పెద్ద కలలు కంటూ ఆకాశాన్ని తాకే అవకాశాన్ని కలిగిస్తుంది.

ఈ సంస్థను మూసివేయడం ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. ఇలాంటి విలువైన వనరును పరిరక్షించడంలో తెలంగాణ ఎందుకు వెనుకబడింది? ఇంతకాలంగా దానిని తిరిగి తెరవడానికి ఒక్క సీరియస్‌ ‌ప్రయత్నం కూడా ఎందుకు జరగలేదు? దీనిపై బాధ్యత వహించాల్సిన సలహా కమిటీ, రాష్ట్ర నాయకత్వం ఈ నిర్లక్ష్యం గురించి సమాధానం చెప్పాలి. కానీ, మేము ఇప్పుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. చర్య తీసుకునే సమయం ఇది.

ఈ బహిరంగ విజ్ఞప్తి ద్వారా, గౌరవనీయ ప్రధానిని ప్రార్థిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌పునరుద్ధరణకు తగిన ఆదేశాలు ఇవ్వమని. ఇది కేవలం ఒక భవనాన్ని తిరిగి తెరవడమే కాదు. మన పిల్లలు నేర్చుకునే, సృష్టించుకునే, అభివృద్ధి చెందే ఒక శక్తివంతమైన స్థలాన్ని తిరిగి పొందడమో. ఇది పిల్లలను భారతదేశ హృదయంగా చూసిన నెహ్రూ మరియు ఇందిరా గాంధీ గారి వారసత్వానికి గౌరవం తెలపడమో. ఇది యువతను తన విధానాల కేంద్రంగా భావించే ప్రభుత్వానికి ఇచ్చిన హామీని నెరవేర్చడమో. ఈ మాటలు రాస్తూనా హృదయం ఆశతో నిండిపోయింది గౌరవనీయ మోదీ గారు, యువత పట్ల మీకున్న అమోఘమైన నిబద్ధతతో, ఈ వినతిని మన్నిస్తారని నమ్ముతున్నా. హైదరాబాద్‌ ‌పిల్లలు దీనికి పూర్తి అర్హులు. మళ్లీ జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌తలుపులు తెరవాలి, మన యువతలోని అనంతమైన సామర్థ్యాన్ని వెలికితీయాలి. వారి భవిష్యత్తే మన భవిష్యత్‌. అదే ఆధారంగా ఉంటుంది. గౌరవనీయ ప్రధానమంత్రి సహకారాన్ని ఈ హైదరాబాద్‌ ఎదురుచూస్తోంది.
       – పర్యావరణ, సామాజిక కార్యకర్త మహమ్మద్‌ ఆబిద్‌ అలీ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page