“ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీల తరహా సిద్ధాంతం అవసరం. బీజేపీకి ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ పార్టీలకు కమ్యూనిజం తరహా బీఆర్ఎస్ కు బలమైన సిద్ధాంతం, అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి..విద్యార్థి యువజన మహిళా రైతు కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల బలోపేతం బీఆర్ఎస్ కు అవసరం.ఆ వైపుగా కొత్త వసంతంలో బీఆర్ఎస్ అడుగులుండాలి. కొత్త వ్యూహాలు, ఎత్తుగడలతో బీఆర్ఎస్ పార్టీ నూతనోత్తేజం వైపు అడుగులు ఉండాలి..”
వలసాంధ్రుల పాలనాలో తెలంగాణ ప్రజలు ఆరు దశాబద్దాలు అరిగోస పడ్డరు. ఆ అరువై ఏండ్ల కన్నీళ్లను, కష్టాలను చూడలేక తెలంగాణ తల్లి ఓ బిడ్డను కన్నది. ఉద్యమ బిడ్డ పేరే టీఆర్ఎస్ పార్టీ..తెలంగాణ తల్లి విముక్తి కోసం, తెలంగాణ ప్రజల దాస్య శృంఖలాలను బద్దలు కొట్టి అణిచివేతలు, అవమానాల నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించేందుకు 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ఒక చరిత్ర.కేసీఆర్ పిలుపు ఓ ప్రభంజనం. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఒక భావోద్వేగం. యువతలో ఉద్వేగం.దశాబ్దాలుగా ఆశలు చచ్చిన తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్/ బీఆర్ఎస్ పార్టీ కొత్త ఆశలను రేకెత్తించింది.
తెలంగాణ విముక్తి కోసం దాదాపు పద్నాలుగేండ్ల పాటు కేసీఆర్ నాయకత్వంతో టీఆర్ఎస్ అహర్నిశలు కృషి చేసింది.స్పష్టమైన గమ్యాన్ని ఎంచుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని టీఆర్ఎస్ పార్టీ ముద్దాడింది. 14 ఏళ్లు రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్, రాష్ట్రం ఏర్పాటు తర్వాత అదే ఉద్యమ స్పూర్తితో రాష్ట్రాన్ని పదేళ్లలో సంబండ వర్గాల సమ్మిళిత, సమీకృతాభివృద్దిని సాధించారు. అలాంటి టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవాలు పూర్తి చేసుకుని మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు.
2001లో టీఆర్‌ఎస్ పుట్టుక ఒక చారిత్రక అవసరం. తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌవరం కోసం టీఆర్ఎస్ పుట్టింది.తెలంగాణ బాధే, టీఆర్ఎస్ గాథైంది..60 ఏళ్లు ప్రాంతేతరుల పాలన భారాన్ని తెలంగాణ తల్లి తన ఎదపై మోసి తల్లి గుండె బరువెక్కింది. తెలంగాణ ప్రజల సొమ్ముతో పరాయివాళ్లు పంచభక్ష్య పరమాన్నాలు తింటుంటే,కోటి రతనాల నా తెలంగాణలో, సకల సంపదల నిలయమైన తెలంగాణలో సొంత ప్రజలు ఆకలిలో అలమటిస్తూ సొంత బిడ్డలు గంజి కేంద్రాల వద్ద బారులు తీరుతూ పస్తులుండటాన్ని జూసి తెలంగాణ తల్లి కంట నీరింకిపోయింది.
దశాబ్దాలుగా దాస్య శృంఖలాల సంకెళ్లను మోసి తల్లి చేతులు కందిపోయాయి.పరాయి పాలనలో ఉమ్మడి బరువును మోసి భుజాలు బరువెక్కిన సమయంలో చరిత్ర గర్భాన్ని చీల్చుకుంటూ కేసీఆర్ నాయకత్వంలో పురుడు పోసుకున్న టిఆర్ఎస్ ఎన్నో పురిటి నొప్పులు భరించింది. తెలంగాణ ప్రజల బాధలు, అణిచివేతలు, కష్టాలు, కన్నీటి గాథల్లోంచి టీఆర్ఎస్ పుట్టింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాతో ఉద్యమాన్ని టీఆర్ఎస్ ఒక యజ్ఞంలా చేసింది.తెలంగాణ గతిని మార్చేందుకు, ప్రజల బతుకు మార్చేందుకు, జనాల జీవితాన్ని చక్కదిద్దేందుకు ఉద్యమ యజ్ఞంలో టీఆర్‌ఎస్ తానే మొదటి సమిధైంది. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే టీఆర్ఎస్ కన్నీరు తీసింది. తెలంగాణకు నష్టమని తెలిస్తే నిప్పుకణికై మంట పుట్టించింది. 2001, ఏప్రిల్ 27న చిన్న కుటీరంలో పురుడు పోసుకున్న టీఆర్‌ఎస్. 2014 జూన్ 2న తెలంగాణకు పురుడు పోసింది. తెలంగాణ కాలికి ముల్లు గుచ్చుకుంటే టీఆర్‌ఎస్ విలవిల్లాడుతోంది. టీఆర్‌ఎస్ బీఆర్ఎస్‌గా మారిన అధికారంలో ఉన్న లేకున్న ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణకు రక్షణ కవచంగా నిలుస్తూ, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే పరితపిస్తున్నది.
14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో టీఆర్ఎస్ ఎన్నో కొత్త పోరాట రూపాలకు జీవం పోసింది. సాగరహారం, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, వంటావార్పు, పల్లెనిద్రలు, సైకిల్ యాత్రలు లాంటి ఎన్నో శాంతియుత ఉద్యమాలకు పురుడు పోసింది. సకల జనులను ఉద్యమంలో భాగస్వామ్యం చేసి బరిగీసి కొట్లాడింది. సంబండ వర్గాలను సమీకరించి ఏకం చేసింది.నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని తన విధానంగా మార్చుకుంది.
అనేక త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న తెలంగాణను కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ప్రజలను ప్రగతిపథంలో నడిపించింది.అభివృద్ధి సంక్షేమ ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టించింది. తెలంగాణ ప్రజల కష్టాలు, బాధలను కండ్లారా చూసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో ఆ కష్టాలను పొలిమేరలో అవతల పాతిపెట్టే ప్రయత్నం చేశారు.లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరకపోయిన అటువైపు బలమైన పునాదులు కేసీఆర్ వేశారు.మన నీళ్లు మన బీళ్లకు మళ్లించారు..మన ఉద్యోగాలు మన పిల్లకే ఇచ్చారు..మన నిధులు మన ప్రజల కోసమే ఖర్చు చేశారు. రెండున్నరేళ్లుగా తెలంగాణ మళ్లీ కన్నీరు కాల్చుతోంది. సవతి బిడ్డ చెర నుంచి విడిపించాలని మొర సొంత బిడ్డకు పెట్టుకుంటున్నది.
2001 నుంచి 2014 వరకు 14 ఏళ్లు అలుపెరుగని పోరాటం చేసింది. అనేక అడ్డంకులు, ఒడిదొడుకులు, కుట్రలు, అణచివేతలను ఛేదిస్తా స్పష్టమైన గమ్యాన్ని నిర్ధేశించుకుని 2014 జూన్ 2న టీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది. అయితే గత 25 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో విజయాలు సాధించింది, ఎన్నో ఎదురుదెబ్బలను చూసింది. దిల్లీ నుంచి గల్లీ వరకూ జాతీయ పార్టీలు, దాయాదులు చేసిన ఎన్నో కుట్రలను ఛేదిచింది. రజతోత్సవాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెట్టింది.. ఏప్రిల్ 27తో మరో వసంతంలోకి అడుగుపెట్టిన టీఆర్ఎస్/ బీఆర్ఎస్ పార్టీ కోట్ల గోంతులను ఏకం చేసింది. అస్థిత్వం, ఆత్మగౌరవం, ఆధిపత్య వ్యతిరేక పోరాటాలే టీఆర్ఎస్ ఉద్యమ ఆయుధాలయ్యాయి. నీళ్ళు నిధులు నియామకాలే ట్యాగ్ లైన్ అయ్యాయి.
టీఆర్ఎస్ /బీఆర్ఎస్ ప్రయాణం ఇంతకు ముందు ఒక ఎత్తైతే ఇక ముందు మరో ఎత్తు కానుంది. రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ అస్థిత్వ పోరాటం, ఆత్మగౌరవవాదం గతంలో ఉన్న బలంగా ఉండకపోవచ్చు. అది అస్థిత్వ ఆత్మగౌరవవాదంపై బలంగా నిర్మించుకున్న బీఆర్ఎస్‌కు ఇక ముందు అంత బలమైనవాదంగా ఉండకపోచ్చు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ కు స్పష్టమైన రాజకీయ ఎజెండా లేదు.బలమైన సిద్దాంతం నిర్మించుకోలేకపోయింది.అస్థిత్వ ఆత్మగౌరవవాదంపై ఇన్ని రోజులు నిలబడింది.పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కావడం, నీళ్ళుపై పోరాటం టీఆర్ఎస్ కు కలిసివచ్చింది.ఇకముందు అది పని చేయకపోవచ్చు.
14 ఏళ్లు ఉద్యమ ఎజెండా..తర్వాత పదేళ్లు అభివృద్ధి, సంక్షేమం మాత్రమే బీఆర్ఎస్ ఎజెండా ఉంది..కానీ పార్టీ పరంగా నిర్మాణ పరంగా కింది స్థాయిలో గ్రైండ్ నుంచి బలమైన సిద్దాంత పునాదులు లేవు.బలమైన క్యాడర్ బేస్ ఉన్న అది సిద్దాంతంతో అనుసంధానం కాలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక నుంచి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు, ఫక్త్ రాజకీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించినా, పార్టీ నిర్మాణానికి, బలమైన పునాదికి అవసరమైన సిద్దాంతాన్ని కేసీఆర్ నిర్మించలేకపోయారు..ఇది బీఆర్ఎస్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. 2023 నాటికి బీఆర్‌ఎస్‌కు మరో ప్రత్యమ్నాయ ఎజెండా లేకపోవడంతో కాంగ్రెస్ కు కలిసివచ్చింది.
అంతేకాదు, తెలంగాణ ఏర్పాటుతో టీఆర్ఎస్ ఎజెండా మార్చాల్సింది. ఒక సిద్దాంతాన్ని తయారు చేసుకోవల్సింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు తప్ప ఎజెండను ఏర్పాటు చేయలేకపోయారు.దీంతో బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ కోల్పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కేసీఆర్ ఇతర ప్రాంతీయ పార్టీలు చేయని సాహసం చేశారు.బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఎదిగిన జాతీయ పార్టీలుగా మారేందుకు సాహసం టీడీపీ, డీఎంకే, ఏఐడీఎంకే వంటి పార్టీలు చేయని సాహసం కేసీఆర్ చేశారు.జార్ఖండ్,తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు దగ్గరి పోలికలున్నాయి.రెండు రాష్ట్రాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా టీఆర్ఎస్ నాయకత్వంలో అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి రాష్ట్రాలను సాధించుకున్నారు.
అలాంటి JMM కూడా జాతీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నం చేయలేదు..కానీ కేసీఆర్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇది బీఆర్ఎస్‌కు ఒక గుణపాఠంగానే చరిత్రలో నిలిచిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయారు. 2024 తర్వాత ఉనికి నిలుపుకునేందుకు బీఆర్ఎస్ కు పోరాట అస్త్రాలే లేవు.బీఆర్ఎస్ గా మారడం..తెలంగాణ అస్తిత్వ వదులుకోవడంతో కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలాయి. అంతేకాదు డీఎంకే , ఏఐడీఎంకేలా బలమైన అస్తిత్వవాద నేపథ్యం ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో బలాన్ని కోల్పోయింది.
నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అస్థిత్వ ఆత్మగౌరవ పోరాటాలు కాస్త తగ్గాయి.మన రాష్ట్రం మనకు రావడంతో మన నేతలే పాలకులు కావడంతో ఆ పోరాటాలు పెద్దగా ఉనికిలో లేకుండా పోయాయి..దీంతో బీఆర్ఎస్ కూడా బలహీనపడింది..అయితే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి రూపంలో బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ వైభవాన్ని అందిస్తున్నారు. ఇది బీఆర్ఎస్‌ను ఊపిరి పోయింది. ఏ ఎజెండాతో ఉనికిలో ఉండాలో అని తర్జన భర్జన పడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నెత్తిన పాలుపోశారు.
తెలంగాణ వ్యతిరేకి, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిని నీడల వెంటాడుతుంటే. ఆయన తీసుకునే తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు మళ్లీ తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌవరంపై దాడి చేసేలా ఉండడం, చంద్రబాబు, వలసాంధ్రులు, ఉత్తరాది బీజేపీ పార్టీల ఎజెంట్‌గా తెలంగాణ సీఎంగా ఉంటున్నారన్న వాదనలకు బలం చేకూర్చేలా రేవంత్ రెడ్డి తీరు ఉంది. ముఖ్యమంత్రి అడుగులు కూడా బీజేపీకి, టీడీపీకి దగ్గర పడుతుండటంతో తెలంగాణలో ఉనికి కోల్పోయిందన్న స్థితి నుంచి రేవంత్ వ్యవహశైలితో బీఆర్ఎస్ మళ్లీ అద్భుతమైన పూర్వ వైభవం సాధించింది.
2023 నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కీలక సమయంలో మరో వసంతంలోకి అడుగుపెట్టింది. గతంలో ఎన్ని సవాళ్లను అధిగమించిన ఇక ముందు కూడా మరిన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉండాలి..కొత్త వసంతంలోకి అడుగుపెట్టుతూ గత సవాళ్లతో పాటు కొత్తగా సవాళ్లు ఎదుర్కోవాలి..పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలమైన సిద్దాంతాన్ని రూపొందించకుండా కేవలం అభివృద్ది సంక్షేమంతోనే అధికారంలోకి వస్తామనుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్‌కు ఎప్పటికైన ప్రమాదమే.
కొత్త ఏటలోకి అడుగుపెట్టుతున్న తరుణంలో బీఆర్ఎస్ కొత్త ఆలోచనలు చేయాలి.తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని రక్షించించే పోరాటలతో పాటు కొత్త వ్యూహాలు కొత్త ఎత్తుగడలతో పార్టీకి బలమైన సైద్దాంతిక బలాన్ని తీసుకురావాలి. అప్పుడే బీఆర్ఎస్ తమిళ పార్టీల్లా బలంగా మారుతుంది.అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బల తర్వాత తమిళ అస్తిత్వవాదం, డీఎంకే మనుగడపై బీఆర్ఎస్ అధ్యాయనం చేసింది. తెలంగాణ అస్తిత్వం కాపాడుకుంటూనే కొత్త ఎత్తుగడలు వ్యూహాలు అవసరాన్ని గుర్తించింది.
ఇంకోవైపు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీజేపీ టీడీపీలతో పాటు కొత్తగా కవిత రూపంలో మరో సవాల్ ఎదురుకానుంది. బీఆర్ఎస్‌ను బలహీనపర్చేందుకు బీజేపీ, రేవంత్ రెడ్డి ప్రోత్సహంతో కవిత పార్టీ పెట్టిన బీఆర్ఎస్ నుంచి అస్థిత్వ,ఆత్మగౌరవ పోరాట వ్యూహలను కవిత చేత హైజాక్ చేయించాలని రేవంత్. బీజేపీ అనుకున్నా కవిత ఎంత వరకు సక్సెస్ అవుతుందో అన్నది కాలం నిర్ణయిస్తుంది కానీ, బీఆర్ఎస్ మాత్రం కొత్త సవాల్‌గా మారుతుంది.
మరోవైపు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారు. రహస్య ఒప్పందాలతో రాష్ట్రంలో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీని నిలువరించకపోతే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఈ లోపు సంస్థగత బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టాలి. అస్తిత్వ ఉద్యమాలతో పాటు కింది నుంచి బలమైన సైద్ధాంతిక పునాదులు అవసరం .కేవలం తెలంగాణ వాదం, అస్థిత్వ వాదంతోనే రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌కు మనుగడ కష్టం.
దేశంలో తమిళ పార్టీలకు తప్ప ఏ ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన సిద్ధాంతాలు లేవు.తెలంగాణలో బీఆర్ఎస్‌కు తెలంగావాదం, ఏపీలో టీడీపీకి తెలుగోడి ఆత్మగౌవరం వంటి ట్యాగ్ లైన్లు తప్ప సిద్దాంతాలు లేవు..అయితే టీడీపీ ఎప్పుడో బీజేపీ దగ్గర ఆత్మగౌరవం తాకట్టు పెట్టింది..పొత్తుతో అధికారంలో వచ్చిన భవిష్యత్‌లో టీడీపీ ఉనికి కూడా ప్రమాదంలో పడే చాన్స్ ఉంది..ఇప్పటికైనా బీఆర్ఎస్ బలమైన సిద్దాంతం రూపొందించుకోకపోతే తెలంగాణలో గులాబీ ఉనికి కూడా ప్రమాదం పడుతుంది.
సిద్ధాంతాలు ప్రాంతీయ పార్టీలకే కాదు. కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. అందుకే దేశంలో ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ క్రమంగా కనుమరుగవుతోంది. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే స్పష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి. అనుబంధ సంఘాలున్నాయి. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎదురుదెబ్బలు తగిలిన కమ్యూనిస్ట్ పార్టీలకు బలమైన క్యాడర్ బేస్ ఉంది.అటు బీజేపీకి కూడా బలమైన సైద్ధాంతిక పునాదులున్నాయి. ఆర్ఎస్‌ఎస్ సహా పార్టీకి అనేక అనుబంధం సంఘాలున్నాయి.ఆ సంఘాలే బీజేపీని బలమైన శక్తిగా నిలబెట్టుతున్నాయి.
ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీల తరహా సిద్ధాంతం అవసరం. బీజేపీకి ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ పార్టీలకు కమ్యూనిజం తరహా బీఆర్ఎస్ కు బలమైన సిద్ధాంతం, అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి..విద్యార్థి యువజన మహిళా రైతు కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల బలోపేతం బీఆర్ఎస్ కు అవసరం.ఆ వైపుగా కొత్త వసంతంలో బీఆర్ఎస్ అడుగులుండాలి. కొత్త వ్యూహాలు, ఎత్తుగడలతో బీఆర్ఎస్ పార్టీ నూతనోత్తేజం వైపు అడుగులు ఉండాలి.
-తోటకూర రమేష్





