“కాలికి గజ్జె కట్టి, గొంగడి భుజాన వేసుకొని, గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ఆట-పాటలతో ఊర్రూతలూగించిన తెలంగాణ కళా సమితి రాష్ట్ర కో-కన్వీనర్ బెల్లి లలిత. తెలంగాణ పాటలు పాడొద్దని, ప్రచారం చెయ్యొద్దని పలుమార్లు బెదిరించినా అదరక బెదరక ముందడుగేసిన చైతన్య దీప్తి బెల్లి లలిత. అదే సమయంలో ఆంధ్ర పెత్తందారుల చెప్పు చేతల్లో నడిచే తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఇది కంటగింపుగా మారింది. అందులో భాగంగానే గద్దర్ పైన కాల్పులు జరిపింది. మారోజు వీరన్నను ఎన్ కౌంటర్ పేరిట హతమార్చింది. ప్రజా కళాకారిణి బెల్లి లలితను ప్రైవేట్ హంతక ముఠాతో అత్యంత కిరాతకంగా పదిహేడు ముక్కలుగా నరికించి హత్య చేయించింది..”
అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయాన రాజ్య హింసలో అసువులు బాసిన తొలిత్యాగం బెల్లి లలితక్కది. అందుకే ఉద్యమ ప్రస్థానంలో గాన కోకిల బెల్లి లలిత స్థానం ప్రత్యేకం. ప్రభుత్వ నిర్బంధం, అణచివేత, ప్రైవేట్ హంతక ముఠాల ప్రోత్సాహక హత్యలు, చిత్రహింసల కొలిమిలో ఎగిసిపడ్డ చరిత్ర తెలంగాణది. ఆట-పాట-మాట బంద్, తెలంగాణ అనే పదం వాడొద్దని రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న అసెంబ్లీలో స్పీకర్ రూలింగ్. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు జరిగిన కాలం నుండి తెలంగాణా సంస్కృతి-సంప్రదాయం, ఆచార-వ్యవహారం, యాస-భాషలు వెక్కిరింపబడుతూనే వచ్చాయి. ఆంధ్ర వలస పెత్తందార్ల పాలనలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాలల్లో వివక్షకు గురవుతూ, ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమాన పడుతున్న రోజులవి. సమస్యలన్నింటికీ పరిష్కారం స్వరాష్ట్రం ఏర్పాటుతోనే సాధ్యమని, ఆత్మ గౌరవ పోరాటానికి సిద్ధామవుతున్న కాలమది.
ఇలాంటి ప్రత్యేక సందర్భంలో కాలికి గజ్జె కట్టి, గొంగడి భుజాన వేసుకొని, గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ఆట-పాటలతో ఊర్రూతలూగించిన తెలంగాణ కళా సమితి రాష్ట్ర కో-కన్వీనర్ బెల్లి లలిత. తెలంగాణ పాటలు పాడొద్దని, ప్రచారం చెయ్యొద్దని పలుమార్లు బెదిరించినా అదరక బెదరక ముందడుగేసిన చైతన్య దీప్తి బెల్లి లలిత. అదే సమయంలో ఆంధ్ర పెత్తందారుల చెప్పు చేతల్లో నడిచే తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఇది కంటగింపుగా మారింది. అందులో భాగంగానే గద్దర్ పైన కాల్పులు జరిపింది. మారోజు వీరన్నను ఎన్ కౌంటర్ పేరిట హతమార్చింది. ప్రజా కళాకారిణి బెల్లి లలితను ప్రైవేట్ హంతక ముఠాతో అత్యంత కిరాతకంగా పదిహేడు ముక్కలుగా నరికించి హత్య చేయించింది. అల్గుబెల్లి రవీందర్ రెడ్డి ని శవంగా మార్చింది. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ పైన తీవ్రమైన హింసను ప్రయోగించి వేధింపులకు గురించేసింది. తెలంగాణ ప్రజలల్లో, ఉద్యమ కారుల్లో తీవ్ర భయాందోళనలు కలిగించి, పోరాటాన్ని నిర్వీర్యం చేసి, అణిచిపెట్టాలనే ప్రభుత్వ కుట్రలో భాగమే ఈ విధమైన రాజ్య హింస. ప్రభుత్వ దుర్మార్గాల్లో అతి కిరాతకమైన హత్య బెల్లి లలితది.
తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ పిరికిపంద చేష్టలపై భగ్గుమన్నది. నిరసనలు మిన్నంటాయి. లలిత త్యాగం ఖండాంతరాలు పాకింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరత్వం పొందిన నేతగా, సాంస్కృతిక సేనాని బెల్లి లలిత త్యాగం చరిత్ర పుటల్లో చిరస్తాయిగా నిలిచి పోయింది.
తొంభయ్యవ దశకం తెలంగాణా ఉద్యమాన్ని మలుపు తిప్పింది. దగాపడ్డ తెలంగాణ – భువనగిరి, తెలంగాణా మహాసభ – సూర్యాపేట, చారిత్రాత్మక వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ జనసభ – హైదరాబాద్ కీలకమైనవి. కాలగమనంలో భౌగోళిక తెలంగాణ నినాదం, సామాజిక తెలంగాణ లు కూడా ప్రత్యేకమైనవే. కేవలం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం చూపగగలదని తెలంగాణ కళాసమితి బలంగా విశ్వసించింది. తెలంగాణ జనసభకు అనుబంధంగా ఏర్పడిన సాంస్కృతిక సైన్యం తెలంగాణ కళాసమితి. దీనికి నేను రాష్ట్ర బాధ్యునిగా వ్యవహరించినందున బెల్లి లలిత, తుర్కపల్లి జహంగీర్, తొర్రూరు ఐలన్న, రంగన్న, శీను…. తదితర వివిధ జిల్లాల కళాకారుల నిబద్ధతను, పోరాట స్ఫూర్తిని దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగింది.
తెలంగాణ కళా సమితి కళాకారులు పల్లె, పట్టణం తేడా లేకుండా రాష్ట్రమంతా వాడవాడలా తమ సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శిస్తూ కలియతిరిగి ప్రజలను ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల, మహిళా సంఘాల, కార్మిక సంఘాల, రైతు కూలీలతో కలిసి ప్రజలలో సాంఘిక చైతన్యానికి నిరంతర కృషిచేసింది. అందులో భాగంగానే అనేక పీడిత కుటుంబాలలో చిచ్చు పెడుతున్న సారా వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామి అయ్యింది. యాదగిరి క్షేత్రంలో కొనసాగుతున్న దుర్మార్గ మురికి కూపం నుండి మహిళలను బయట పడేసేందుకు వ్యభిచార వ్యతిరేక కూటమిలో పాల్గొన్నది. సామాజిక రుగ్మతగా మారి, యువతను నిర్వీర్యం చేస్తున్న గుట్కా వ్యతిరేక పోరాటంలో పాల్గొని తన గానంతో చైతన్య పరిచింది. గొల్ల కురుమ ఆడబిడ్డగా వారిలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించేందుకు గొల్లకురుమ డోల్ దెబ్బ కళాసమితికి కన్వీనర్ గా తన బాధ్యతను గొప్పగా నిర్వహించింది. అలుపెరుగని పోరాటంలో పోలీస్ ఎక్కుపెట్టిన తుపాకులను గెలిచేసి వేదికలెక్కి పాటలు పాడుతూ ప్రజలలో ధైర్యాన్ని నూరిపోసింది. మరో పక్క తాను పనిచేస్తున్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కార్మికుల హక్కుల సాధన పోరాటంలో ముందు నిలిచింది.
ప్రజాస్వామ్య మడిగెనా తెలంగాణ జనసభ, ప్రత్యేక రాష్ట్ర మన్నదా తెలంగాణ జనసభ! అనిపాడుతూ రాష్ట్ర సాధనలో తన రాజకీయ విశ్వాసాన్ని చాటిచెప్పింది. అడగండమ్మా మీరు అడగండమ్మా! ఓట్లడిగే లీడర్లను అడగండమ్మా.., అని కోరుతూ ఓటుకోసం వచ్చినపుడు, ఓటేసుకున్నపుడు, ఏమేమి చెప్పిండో, ఏమేమి చేసిండో గెలిచినంక గద్దెక్కి కూర్చోని ఎట్లాగ మారిండో వివరిస్తూ, ఓట్లడిగెటందుకు వచ్చే రాజకీయ నాయకులను ప్రశ్నించండని ఎలుగెత్తి చాటింది. రాజకీయ నాయకుల బండారాన్ని బట్టబయలు చేసింది. తెలంగాణ అంటేనే ప్రశ్నించడం. రాజ్య హింసా రగులుతున్నాదో.., తెలంగాణ గడ్డన నెత్తుటేరులు పారుతున్నాయో! అంటూ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను, కళ్ళకు కట్టినట్టు వివరించింది. ఇలా ఎన్నో పాటలు పాడుతూ, కుటుంబాన్ని వదిలి, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం తుది శ్వాసవరకు అలుపెరుగని పోరాటం చేసిన చరిత్ర బెల్లి లలితది. రాష్ట్ర కన్వీనర్ జహంగీర్ తో కలిసి అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ జిల్లాలలోని కళాకారులతో కలిసి సాంస్కృతిక ఉద్యమానికి ఊపిరులూదింది. లేడీ గద్దర్ అని మీడియా కీర్తించినా పొంగిపోలేదు. ఆర్ధిక పరిస్థితులు అతాకుతలం చేసినా మడమ తిప్పలేదు. పాలకుల పంచన చేరలేదు. తాను నమ్మిన తోవ ఎంత ప్రమాదకరమైందో తెలిసినా వెన్ను చూపలేదు. తెలంగాణ అంటేనే త్యాగం.
గుర్తింపు కోసం ఏనాడు ఆరాట పడలేదు. బెల్లి లలితక్క అంటే త్యాగానికి ప్రతీక, మారుపేరుగా నిలిచింది. వలస కార్మికుల, నిర్వాసితుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పాటలు పాడింది. నదీ జలాల పంపిణీపై వివక్షత కు వ్యతిరేకంగా గళం విప్పింది. లలిత ఆశయ సాధన కోసం పోరాడుతామని ప్రతినబూని, ఆమె కలలుగన్న ప్రజాస్వామిక తెలంగాణ సాధించడానికి కృషిచేయడమే బెల్లి లలితక్క కు మనమిచ్చే నిజమైన నివాళి!
రమణా చారి





