– ఒక పదం పట్టుకుని రాజకీయం చేయడం తగదు
– మీకు కనీస మేథో పరిపక్వత కూడా లేదు
– కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : బెంగళూరులో జరిగిన ద హిందూ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక పదాన్ని పట్టుకుని కొందరు బీఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేయడం అత్యంత సిగ్గుచేటు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. అక్కడ సీఎం మాట్లాడిన అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీ, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్‌ను అర్థం చేసుకునే కనీస మేథో పరిపక్వత వారికి లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఆ మాత్రం ఉక్కు సంకల్పం ఉండాలనే ఉద్దేశంతోనే హిట్లర్ గురించి సీఎం చెప్పారని వివరించారు. అక్కడ చర్చ జరిగిన సందర్భం ఏంటో తెలియదు.. ఆ సదస్సు సారాంశం ఏంటో తెలియదు కానీ హిట్లర్ పదాన్ని పట్టుకుని ప్రభుత్వం మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. హైడ్రా స్పీడ్‌కు కబ్జాదారుల గుండెల్లో పుడుతున్న వణుకు చూసి తట్టుకోలేక, ఓర్వలేక ఈ హిట్లర్ ముసుగు వేసుకుని కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు.చట్టం అమలులో చూపించే కఠినత్వాన్ని ఫాసిజం అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. హైడ్రా చట్ట పరిధిలోనే పని చేస్తోందని, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే నోటీసులు ఇస్తోందని తెలిపారు. ఈ మార్పు తెలంగాణకు అవసరమని, దీన్ని ప్రతి మేధావీ, ప్రతి సామాన్యుడూ స్వాగతిస్తున్నారని చెప్పారు. హిట్లర్ క్రూరత్వాన్ని, ఆ హింసాత్మక ఫాసిజాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సమర్థించదని స్పష్టం చేశారు. పదేళ్లపాటు సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్‌కు ఇనుప కంచెలు వేసి సామాన్యులకు ప్రవేశం లేకుండా ఒక హిట్లర్ బంకర్‌లాగా దాన్ని మార్చి పాలించినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మీదా గాంధీ మార్గం.. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తేసి ప్రజాస్వామ్య గొంతు నొక్కిన మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది.. ప్రత్యర్థులపై, సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాపింగ్‌లు చేయించిన మీదా ప్రజాస్వామ్యం.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఆశయాల ప్రకారం నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా.. నియామకాలు కేవలం మీ కుటుంబానికే జరిగాయి తప్ప నిరుద్యోగులకేమైనా లాభం జరిగిందా.. టీజీపీఎస్సీ పేపర్లను పప్పు బఠానీల్లా మార్కెట్లో అమ్మకానికి పెట్టి లక్షలాది నిరుద్యోగులకు అన్యాయం చేసింది మీరు కాదా అని శ్రీధర్‌బాబు నిలదీశారు. ఇలాంటి కబుర్లు చెప్తే వినేటోడు మీ బీఆర్‌ఎస్ కార్యకర్త అయితే సరిపోతాడన్నారు. ప్రజలు నవ్వుకుంటారనే సోయి లేదా అని అడిగారు. అహంకారంతో ఊగిపోయిన మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారంటూ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకరించాలి తప్ప చిల్లర వ్యాఖ్యలతో డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దని సూచించారు.
కాంగ్రెస్‌పై ప్రజలు విసిగిపోయారన్నది మీ భ్రమే
పెద్దపల్లి జిల్లా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్‌పై ప్రజలు విసిగిపోయారనడం మీ భ్రమ. రెండున్నరేళ్ల తమ ప్రజాపాలన చూసి మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పదేళ్ల మీ అహంకారానికి ప్రజలు ఆల్రెడీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన సంగతి మర్చిపోయారా అని అడిగారు. బీఆర్‌ఎస్ లీడర్లు తలకిందులుగా తపస్సు చేసినా మీ మునిగిపోయే కారుకు పది సీట్లు కూడా రావు.. వంద సీట్లు అనే పగటి కలలు మానండి అని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లాలో భూముల ధరలు తగ్గాయని హరీష్‌రావు విమర్శించడం హాస్యాస్పదం, దుర్మార్గం అని అన్నారు. పదేళ్ల మీ పాలనలో మీ పార్టీ నాయకులు, ల్యాండ్ మాఫియా కలిసి కృత్రిమంగా రేట్లు పెంచి పెద్దపల్లిలో సామాన్యుడు గజం భూమి కొనాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి తెచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. పోలీసులను ప్రగతి భవన్ కాపలాదారులుగా మార్చి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది మీ కేసీఆర్ కాదా.. మీ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే మీకు, మీ బంధువులకు మాత్రమే అని అన్నారు. తమ ప్రభుత్వం పోలీసుల హక్కులకు, వారి సంక్షేమానికి సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. జీతాల కోత, అలవెన్సుల రద్దు అనేవి మీ ఐటీ సెల్ సృష్టించిన అభూతకల్పనలు మాత్రమేనన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తూ, సమాజంలో విద్వేషాలు రేకెత్తించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటే దానిని కక్షపూరితం అనడం ఎంతవరకు సమంజసమని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలో మీ పార్టీ సమావేశంలో ప్రభుత్వ, పోలీస్ అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ మేం అధికారంలోకొచ్చాక బుద్ధి చెబుతాం అని బహిరంగంగా హెచ్చరించడం ఒక మాజీ మంత్రిగా మీకు తగదన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆరఎస్‌కు లేదన్నారు. తమ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధరతోపాటు అర్హులైన రైతులకు రూ.500 బోనస్ అందిస్తూ నిరంతరాయంగా ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. జిల్లా యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఎక్కడా రైతులకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరుపుతోందంటూ రాజకీయ విమర్శల కోసం వాస్తవాలను మరుగునపరచడం తగదన్నారు. 2014, 2018 ఎన్నికల ముందు మీరిచ్చిన మేనిఫెస్టోలను ఒక్కసారి పరిశీలించాలని, అందులో ఎన్ని హామీలను నెరవేర్చారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. రైతుబంధుకు ఎగనామం పెట్టలేదు.. అర్హులైన ప్రతి రైతుకూ రైౖతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. వ్యవసాయానికి మరింత నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తును అందించాలనే సంకల్పంతోనే రైతు డిస్కంకు శ్రీకారం చుట్టాం తప్ప ఉచిత విద్యుత్తును నిలిపేయడానికి కాదన్నారు. రైౖతుల మేలు కోసం ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇలాంటి అపోహలు, అసత్య ప్రచారాలు చేయడం బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా మీకు తగదన్నారు.
సింగరేణిపై అసత్య ప్రచారాలు మానండి
2014లో అప్పటి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత,బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక, ప్రభుత్వరంగ వ్యతిరేక ఎంఎండీఆర్ చట్టానికి మద్దతు తెలిపింది నిజం కాదా.. బొగ్గు గనుల వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించి మీ పార్టీకి అనుకూలమైన ప్రైవేట్ సంస్థలు, బినామీలకు బ్లాకులు వెళ్లే పరిస్థితులు కల్పించింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఫలితంగా కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3 వంటి విలువైన బొగ్గు గనులు సింగరేణికి దక్కకుండా పోయాయని, దీనివల్ల భవిష్యత్తులో సంస్థకు రూ.2000 కోట్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఈ నష్టానికి బాధ్యత ఎవరిది.. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన బొగ్గు, విద్యుత్ బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు చెల్లించకుండా సంస్థపై ఆర్థిక భారం మోపింది మీ ప్రభుత్వమే కదా అని అడిగారు. శ్రీరాంపూర్ సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఈ కింది హామీలు ఏమయ్యాయి.. వీటిల్లో ఎన్ని అమలు చేశారో చెప్పండన్నారు. పదివేల నూతన కార్మిక క్వార్టర్లు, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, మారుపేర్ల మార్పు సమస్య పరిష్కారం, డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాలకు పెంపు, కార్మిక సంక్షేమానికి ప్రత్యేక చర్యల సంగతేమిటన్నారు. మీ హయాంలో మితిమీరిన రాజకీయ జోక్యంతో ఓబీ టెండర్లు మీ లీడర్‌కి ఇచ్చింది నిజం కాదా.. ఇప్పుడు ఉన్న మెజారిటీ ఓబీ, కాంట్రాక్టర్లు బీఆరఎస్‌కు సంబంధించిన వారు కాదా.. మీ హయాంలోనే కదా ప్రైవేటు బొగ్గు డిపోలకు పర్మిషన్ ఇచ్చింది.. నేటి మెడికల్ బోర్డు వ్యవస్థ సంక్షోభానికి కారణం ఎవరు.. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ జోక్యం, పైరవీలతో మెడికల్ బోర్డును వివాదాస్పదం చేసింది ఎవరు.. 2023 గుర్తింపు సంఘం ఎన్నికలపుడు కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి పోటీ చేసే ధైర్యం కూడా చేయని మీరా మమ్మల్ని ప్రశ్నించేది అని అడిగారు. తాము అధికారంలోకి వచ్చాక సుమారు 30వేలమంది కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటాగా రూ.5,000, తదుపరి సంవత్సరంలో రూ.5,500 అందించాం.. రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పించాం.. డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితిని 35 నుండి 40 సంవత్సరాలకు పెంచాం.. శాశ్వత కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల బీమా, కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, లైజనింగ్ అధికారుల నియామకం, సింగరేణి భవిష్యత్తు కోసం సోలార్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం, సంస్థ విస్తరణ కోసం ఇతర ఖనిజ రంగాల్లో అడుగులు వేశామని వివరించారు. ఉత్పత్తి, రవాణా, ఆర్థిక పనితీరులో రికార్డుస్థాయి పురోగతిలో ఉన్నామన్నారు. 2014 నుంచి సింగరేణిలో జరిగిన అక్రమాలపై విచారణకు తాము సిద్ధం అని సవాల్ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్