వీబీ జీ రామ్‌జీ అమలు కష్టమే

– కొత్త చట్టంతో జరిగే నష్టం భర్తీకి చర్యలు తీసుకుంటాం
– ప్రత్యామ్నాయాలపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ-రామ్‌జీ చట్టం జులై 1 నుంచి అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై విస్తృతంగా సమాలోచనలు ప్రారంభించింది. ఈ మేరకు సచివాలయంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వీబీ జీ రామ్‌జీ చట్టంలోని ప్రధాన నిబంధనలు, వాటి ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం, గ్రామీణ ఉపాధిపై ప్రభావం తదితర అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న నరేగాతో పోలిస్తే కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్‌లలో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వాల్సి ఉండటం, రాష్ట్రాలకు ముందుగా నిర్ణయించిన నిర్ణీత నిధుల కేటాయింపు విధానం అమలు, కేంద్ర, రాష్ట్ర వ్యయ భాగస్వామ్యాన్ని 60:40 నిష్పత్తికి మార్చడం వంటి అంశాలు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చించారు. గ్రామీణ కార్మికులకు డిమాండ్ మేరకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించే విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలను అధికారులు వివరించారు. అవసరమైతే రాష్ట్రస్థాయిలో ప్రత్యేక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం, కేంద్రం నిర్ణయించే నార్మేటివ్ కేటాయింపులకు మించి అవసరమయ్యే వ్యయాన్ని రాష్ట్రం భరించే అవకాశాలు, కేంద్ర రాష్ట్ర నిధుల భాగస్వామ్య విధానంలో మార్పులు కోరడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కర్ణాటక, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు వీబీజీ రామ్‌జీ చట్టంపై అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హక్కు, రాష్ట్రాల ఆర్థిక భారం, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన అంశాలపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు, చర్యలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదల ఉపాధి, జీవనోపాధి ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా మారిందని, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నీ ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఉపాధి హక్కును కాపాడటం తమ కర్తవ్యం. కొత్త చట్టం అమలుతో రాష్ట్ర కార్మికులు, రైతులు, గ్రామీణ కుటుంబాలు నష్టపోకుండా ఉండేలా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నాం. కొత్త చట్టంతో జరిగే నష్టాన్ని భర్తీ చేసే విధంగా చర్యలు చేపడతాం అని పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, స్పెషల్ కమిషనర్ బి.శ్రీలక్ష్మి, జాయింట్ కమిషనర్ నర్సింహులు, లా సెక్రటరి పాపిరెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, అడిషనల్ కమిషనర్ విజయ్ కుమార్, స్పెషల్ జీ.పీ రాహుల్ రెడ్డి, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ రక్షిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *