– ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా భారత్
- మైనింగ్, కోల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు
– ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
– కోల్ రంగంలో సంస్కరణలతో ఐదు లక్షల మందికి ఉపాధి
– క్రిటికల్ మినరల్స్ కోసం అర్జెంటీనాతో ఒప్పందం
– కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8:విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను క్రమంగా తగ్గించే పనిలో ఉన్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రతి వారం బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో రూ.1.89లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని ‘కాగ్ ’నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన కోల్ మైన్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. గతంలో బొగ్గును చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. అయితే ఇప్పుడు ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం అని వివరించారు. అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్‌పై అధ్యయనం చేస్తున్నాం. ఈనెల 11న ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తాం. 2028 నాటికి అన్ని కోల్ బ్లాక్స్ మూసేస్తాం. క్రిటికల్ మినరల్స్ మిషన్ ప్రయోగానికి రూ.1,500 కోట్లు కేటాయించాం. 24 క్రిటికల్ మినరల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. అర్జెంటీనాలో 6 క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్ తీసుకున్నాం అని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి కోసం అనేక కీలక సంస్కరణలు అమలు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మైనింగ్, కోల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. గతంలో బొగ్గు రంగం అవినీతి, అక్రమాలు, అరకొర నిధులతో ఇబ్బందులు ఎదుర్కొనేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రంగం పూర్తిగా రూపాంతరం చెందిందన్నారు. కోల్ రంగంలో సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా సుమారు ఐదులక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని కిషన్ రెడ్డి వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని.. అప్పటి కేంద్ర బొగ్గు మంత్రి జైలుకు వెళ్లిన పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కోల్ రంగం పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. ప్రపంచంలో బొగ్గు వినియోగంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని, దేశ విద్యుత్ ఉత్పత్తిలో 72శాతం బొగ్గుపైనే ఆధారపడి ఉందని మంత్రి వివరించారు. ఈ ఏడాది దేశం ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం దేశ అవసరాలకు 80 రోజులకు సరిపడేలా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగకుండా కోల్ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. స్టీల్, ఎరువుల పరిశ్రమలతో పాటు అనేక రంగాలకు బొగ్గు కీలక ముడి పదార్థమని మన్నారు. గతంలో విదేశాల నుంచి భారీగా బొగ్గు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దేశీయ ఉత్పత్తి పెరగడంతో దిగుమతులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. మైనింగ్ ప్రాంతాల్లో రైల్వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ రవాణా ఖర్చులు తగ్గించే చర్యలు చేపడుతు న్నామని చెప్పారు. క్రిటికల్ మినరల్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొందని, వాటి కోసం దేశాధినేతలను కూడా కిడ్నాప్ చేసే స్థాయికి పరిస్థితులు వెళ్లాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌కు ఒక పొరుగు దేశం కీలక ఖనిజాల సరఫరాను నిలిపివేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్‌లో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో కూడా కీలక ఖనిజాల సరఫరాపై వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని చెప్పారు. కోల్ ఆధారంగా సింథటిక్ గ్యాస్ తయారీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయంగా ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల వంటి పరిస్థితుల వల్ల ఇంధన దిగుమతులపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరుల అభివృద్ధి అవసరమని అన్నారు. దేశంలో 187 బొగ్గు గనులు ఉన్నాయని, వినియోగం పూర్తయిన గనులను శాస్త్రీయ పద్ధతుల్లో మూసివేస్తున్నామని మంత్రి తెలిపారు. మూసివేసిన గనుల్లో పెద్ద ఎత్తున వృక్షారోపణ, పర్యాటక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ గనులను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, గిన్నిస్ బుక్ రికార్డుకు కూడా ప్రయత్నిస్తు న్నామని వెల్లడించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గనుల ప్రభావిత గ్రామాల అభివృద్ధికి 2శాతం నిధులు కేటాయించాలని చట్టం చేసినప్పటికీ, ఆ నిధులను జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. కలెక్టర్లను అడిగితే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదనే సమాధానం వస్తోందని చెప్పారు. సింగరేణి కాలరీస్ వ్యవహారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని పేర్కొన్న ఆయన, గతంలో డీఎంఎఫ్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని విమర్శించారు. సింగరేణి ఆర్థిక భారం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని, ఉద్యోగుల కోసం బీమా సదుపాయాలు కూడా తీసుకొచ్చామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గత 12 ఏళ్లలో మోదీ తన పాలనలో ప్రత్యేకమైన ముద్ర వేసారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ అభివృద్ధితో పాటు సామాజిక సంక్షేమానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అవినీతికి కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్