“మొత్తం జనాభాలో దాదాపు 97 శాతాన్ని పరిశీలించిన సమగ్ర సర్వే మొదటి అంకం. ఆ సర్వే గణాంకాలను నిశితంగా పరిశోధించిన నిపుణుల బృందం తయారు చేసిన నివేదిక రెండో అంకం. ఆ నివేదిక ఆధారంగా తీసుకోవలసిన పాలనాపరమైన విధానాలు, చర్యలు మూడో అంకం. ఈ మూడు అంకాల కార్యక్రమంలో రెండు అంకాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు..”
కుల గణన పేరుతో అందరికీ తెలిసిన ‘తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024’ సమగ్ర నివేదికను ప్రభుత్వం ఎట్టకేలకు ఏప్రిల్ 15న బైట పెట్టింది. ఈ సర్వే కోసం నియమించిన ‘స్వతంత్ర నిపుణుల కార్యాచరణ బృందం’ నివేదిక రెండు సంపుటాలు (322 పేజీలు), ఆ నివేదికకు ఆధారమైన సమగ్ర ఇంటింటి సర్వే పట్టికలు నాలుగు సంపుటాలు (1096 పేజీలు) ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెబ్ సైట్ మీద ఉన్నాయి. ఈ పద్నాలుగు వందల పేజీల పైబడిన సంపుటాలలో ఉన్న సమాచారాన్నీ, నిర్ధారణలనూ వివరంగా, నిశితంగా అధ్యయనం చేసి, ఈ నివేదికలు తెలంగాణ సమాజ స్థితికి అద్దం పడుతున్నాయా, ఆ స్థితి మార్చవలసి ఉందని చెపుతున్నాయా, అలా మార్చడానికి ప్రభుత్వం ఏమి చేయబోతున్నది అనే పెద్ద ప్రశ్నలకు ఇటువంటి శీర్షికలో ఒక్క వ్యాసంలో జవాబు చెప్పడం సాధ్యం కాదు గాని, ఈ నివేదికలు బహిర్గతమైన నేపథ్యంలో చర్చించవలసిన స్థూల అంశాలు చాలా ఉన్నాయి.
ఈ సర్వే ప్రారంభమైనప్పుడు 2024 నవంబర్ 7న, సంక్షిప్త నివేదిక విడుదల చేసినప్పుడు 2025 ఫిబ్రవరి 6న ఇదే శీర్షికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను మరొకసారి చెప్పుకుని, చర్చలోకి వెళ్దాం. “… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమ ప్రారంభం కోసం రావడం ఆహ్వానించదగిన సంగతులే. కాని కులగణన విషయంలో కాంగ్రెస్ చరిత్ర వల్ల, తెలంగాణ ప్రభుత్వ చరిత్ర వల్ల, ఇతర రాష్ట్రాల కులగణన అనుభవాల వల్ల ప్రస్తుత ప్రయత్నం సఫలమవుతుందా, అవసరమైన ఫలితాలు సాధిస్తుందా, ఈ కులగణన గణాంకాలతో నిజంగా వెనుకబడిన కులాలకు ఏమైనా మేలు జరుగుతుందా అని అనుమానించవలసి వస్తున్నది” అని 2024 నవంబర్ 7న అన్నాను.
“… తెలంగాణలో ప్రతి ఒక్క కులాన్నీ, ఉపకులాన్నీ పరిగణనలోకి తీసుకున్నారా లేదా తెలియదు. అసలు తమ దగ్గరికి ఎన్యూమరేటర్లు రానేలేదని చెపుతున్న వారు ఎందరో ఉన్నారు గనుక, దాదాపు పదహారు లక్షల మంది సమాచారం ఇవ్వనే లేదని అంటున్నారు గనుక, అసలు జనగణన జరగవలసినట్టుగా జరగలేదనే అనుకోవాలి. ఆ పూర్తి నివేదికను కూడా బైటపెట్టడానికి సంకోచిస్తున్నారంటే అందులో ఉన్న లొసుగులేవో వారికే తెలిసి ఉండాలి” అని 2025 ఫిబ్రవరి 6న అన్నాను.
“మొత్తం 242 కులాల సగటు వెనుకబాటుతనం స్కోర్ 81 కాగా, 135 కులాలు ఆ సగటు కన్నా ఎక్కువ స్కోర్ తో, అంటే ఎక్కువ వెనుకబాటుతనంతో ఉన్నాయి. ఆ 135లో 69 బీసీ, 41 ఎస్సీ, 25 ఎస్టీ సమూహాలు. ఇక తక్కువ వెనుకబాటుతనం ఉన్న 107 కులాల్లో, జనరల్ కాటగరీ 18 కులాలు, బీసీ 67 కులాలు, ఎస్సీ 18 కులాలు, ఎస్టీ ఏడు తెగలు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే వెనుకబాటుతనం ఎక్కువ తక్కువలుగా అన్ని కులాల్లోనూ ఉందని, సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సమూహాల్లో కూడా వెనుకబాటుతనం తక్కువ ఉన్న కులాలు ఉన్నాయని అనిపిస్తుంది గాని, మరొక స్థాయి గణాంకాలు చూస్తే, ఎస్టీల్లో 99 శాతం, ఎస్సీల్లో 97 శాతం, బీసీల్లో 71 శాతం వెనుకబాటుతనంలో ఉన్నారని తేలింది.”
ఇప్పడు, ఏడాదిన్నర తర్వాతనైనా ప్రభుత్వం పూర్తి నివేదికను బైటపెట్టినందుకు సంతోషం. మొత్తం జనాభాలో దాదాపు 97 శాతాన్ని పరిశీలించిన సమగ్ర సర్వే మొదటి అంకం. ఆ సర్వే గణాంకాలను నిశితంగా పరిశోధించిన నిపుణుల బృందం తయారు చేసిన నివేదిక రెండో అంకం. ఆ నివేదిక ఆధారంగా తీసుకోవలసిన పాలనాపరమైన విధానాలు, చర్యలు మూడో అంకం. ఈ మూడు అంకాల కార్యక్రమంలో రెండు అంకాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు. కాని ముందుంది ముసళ్ల పండుగ. కుల ఆధారిత వెనుకబాటుతనం గురించి ఇంత విస్పష్టమైన గణాంకాలు బైటపడిన తర్వాత, ఆ వెనుకబాటుతనాన్ని నిర్మూలించడానికి, కనీసం తగ్గించడానికి ఎటువంటి విధానాలు ప్రకటించబోతున్నారు, ఏయే కుల సమూహాలకు మరింత ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ చర్యలు అవసరమో నిర్ధారించారా, ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ప్రకటించే విధానాలు ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తారు వంటి కీలకమైన ప్రశ్నలు తలెత్తుతాయి. విభిన్న కుల సమూహాల ప్రయోజనాల మధ్య ఘర్షణ వల్ల, కొన్ని సమూహాల పట్ల పాలక పక్షాలకు ఉండే పక్షపాతం వల్ల, చిన్నచూపు వల్ల, వ్యవస్థాగత, చారిత్రక, రాజకీయార్థిక కారణాల వల్ల చివరి మూడో అంకం చాలా కష్టతరమైనదీ, అసాధ్యమైనదీ. ఆ అంకం దాకా వెళ్లి, దాన్ని విజయవంతం చేసే కోరికా, చిత్తశుద్ధీ పాలకులకు ఉన్నాయా లేవా అనేది ఇంకో రెండు సంవత్సరాల్లో స్పష్టమవుతుంది. ఆ ప్రశ్నను భవిష్యత్తుకు వదిలి, ఇప్పటికి జరిగిన రెండు అంకాలలో కీలకమైన అంశాలు చర్చించుకోవాలి.
ఈ సర్వే లక్ష్యం వెనుకబాటుతనాన్ని నిర్ధారించడం, వెనుకబాటుతనానికీ కులానికీ మధ్య ఉన్న సంబంధాన్ని (సంబంధమే లేదని కొందరు మేధావులు అంటున్న నేపథ్యంలో) కనిపెట్టడం కాబట్టి అసలు వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ఈ బృందం ఒక సమగ్ర సూచిక తయారు చేయడానికి ప్రయత్నించింది. సంకీర్ణ వెనుకబాటుతనం సూచిక (కాంపోజిట్ బ్యాక్వర్డ్ నెస్ ఇండెక్స్ – సిబిఐ) అనే ఆ సూచిక 42 ప్రాతిపదికలతో తయారు చేశారు. ఇందులో సామాజిక వివక్ష గురించి రెండు ప్రాతిపదికలు, లింగ వివక్ష మూడు ప్రాతిపదికలు, విద్యాస్థాయి ఎనిమిది ప్రాతిపదికలు, వృత్తి తొమ్మిది ప్రాతిపదికలు, ఆదాయం నాలుగు ప్రాతిపదికలు, భూయాజమాన్యం, చరాస్తి ఎనిమిది ప్రాతిపదికలు, జీవన స్థితి ఆరు ప్రాతిపదికలు, రుణాల స్థితి రెండు ప్రాతిపదికలు ఉన్నాయి.
ఈ సిబిఐ ఆధారంగా రాష్ట్రంలో 242 కులాలకు చెందిన మూడు కోట్ల యాబై ఐదు లక్షల మందిని సర్వే చేశారు. ఒక్కొక్క కులానికీ ఈ 42 ప్రాతిపదికలకు వచ్చిన జవాబుల మీద ఆధారపడి వెనుకబాటుతనానికి స్కోర్ – పాయింట్లు ఇస్తూ పోయారు. ఆ స్కోర్ 0 నుంచి 126 వరకూ ఉండవచ్చు. అంటే ఒక కులం ఆ 42 ప్రాతిపదికలలోనూ అత్యంత వెనుకబాటుతనంతో ఉంటే దాని స్కోర్ 126 అవుతుంది. అన్ని ప్రాతిపదికలలోనూ అతి తక్కువ వెనుకబాటుతనం ఉంటే స్కోర్ 0 అవుతుంది. ఆ లెక్కన రాష్ట్రంలో డక్కలి (షెడ్యూల్డ్ కులం) 116 స్కోర్ తో అతి ఎక్కువ వెనుకబాటుతనంలో ఉంది. కాపు కులం 12 స్కోర్ తో అతి తక్కువ వెనుకబాటుతనంలో ఉంది.
మొత్తం 242 కులాల సగటు వెనుకబాటుతనం స్కోర్ 81 కాగా, 135 కులాలు ఆ సగటు కన్నా ఎక్కువ స్కోర్ తో, అంటే ఎక్కువ వెనుకబాటుతనంతో ఉన్నాయి. ఆ 135లో 69 బీసీ, 41 ఎస్సీ, 25 ఎస్టీ సమూహాలు. ఇక తక్కువ వెనుకబాటుతనం ఉన్న 107 కులాల్లో, జనరల్ కాటగరీ 18 కులాలు, బీసీ 67 కులాలు, ఎస్సీ 18 కులాలు, ఎస్టీ ఏడు తెగలు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే వెనుకబాటుతనం ఎక్కువ తక్కువలుగా అన్ని కులాల్లోనూ ఉందని, సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సమూహాల్లో కూడా వెనుకబాటుతనం తక్కువ ఉన్న కులాలు ఉన్నాయని అనిపిస్తుంది గాని, మరొక స్థాయి గణాంకాలు చూస్తే, ఎస్టీల్లో 99 శాతం, ఎస్సీల్లో 97 శాతం, బీసీల్లో 71 శాతం వెనుకబాటుతనంలో ఉన్నారని తేలింది. అలాగే, ఎస్సీల్లో సగం మంది రోజు కూలీలుగా ఉన్న స్థితి ఉండగా, జనరల్ కాటగరీ కులాల్లో అది పది శాతం కన్నా తక్కువ. ప్రైవేట్ రంగ ఉద్యోగుల్లో జనరల్ కాటగరీ 30 శాతం ఉండగా, ఎస్టీలు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు. వెనుకబాటుతనం కారణాలను సిబిఐ ప్రమాణం ఒక్కటే సంపూర్ణంగా వివరించజాలదు అని, సిబిఐ స్కోర్ సాపేక్షికమే తప్ప సంపూర్ణం కాదని మినహాయింపులు నివేదికలోనే ప్రకటించారు గాని సిబిఐతో సమస్యలున్నాయి. సిబిఐ తయారు చేయడానికి ప్రాతిపదికలు సరైనవేనా, ఆ ప్రాతిపదికల మధ్య తారతమ్యత లేకుండా అన్నిటికీ సమానమైన ప్రాధాన్యత (వెయిటేజి) ఇవ్వడం సరైనదేనా వంటి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
“జనసంఖ్యలో మూడు నాలుగు శాతం మించని ఒకటి రెండు కులాలే ఆధిపత్య కులాలుగా అధికారాన్నీ, సంపదనూ అనుభవిస్తుండడానికి కారణాలు చారిత్రకమైనవీ, రాజకీయార్థికమైనవీ తప్ప జనసంఖ్య కాదనే వాస్తవాన్ని ఈ గణాంకాలు చూపుతున్నాయి. సర్వే ప్రశ్నల్లో గాని, ప్రాతిపదికల్లో గాని ఇటువంటి చారిత్రక, రాజకీయార్థిక, వ్యవస్థాగత అంశాలను వెలికితీసే ప్రశ్న ఒక్కటి కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.”
సిబిఐ అనే కొత్త ప్రమాణంతో వచ్చే సమస్యలు మాత్రమే కాక అసలు ఇంటింటి సర్వేలలో మామూలుగా ఉండే సమస్యలు ఉన్నాయి. సమాజంలో కేవలం ప్రశ్న జవాబులతో, అంకెలతో తేల్చలేని అంశాలుంటాయి. ఆ సమయానికి సర్వే చేయడానికి వెళ్లిన వ్యక్తి వేసే ప్రశ్నలకు ఎదుటి వ్యక్తి చెప్పే జవాబు సర్వ సమగ్రమైన సరైన జవాబు కావాలని ఏమీ లేదు. ఆ జవాబుల్లో నిర్లక్ష్యం, దురభిప్రాయాలు, ఎక్కువ చేసి చెప్పడం, తక్కువ చేసి చెప్పడం, అంకెల్లో చెప్పలేకపోవడం ఉండవచ్చు. వారు గుణాత్మకంగా చెప్పినది ప్రశ్నాపత్రంలోని పరిమాణాత్మక అంశాలలో దేనితో సరిపోతుందో సర్వేయర్ తేల్చుకోలేక, తనకు తోచినదానికి టిక్ కొట్టవచ్చు. ఇటువంటి అనేక సమస్యలు సర్వే పద్ధతిలో ఉన్నాయని గతంలో ఎందరో గుర్తించారు.
అసలు గుణాత్మకమైన సామాజిక అంశాలను పరిమాణాత్మకంగా అంకెల్లోకి, గణాంకాల్లోకి మార్చడం అన్ని సందర్భాల్లోనూ, సక్రమంగా సాధ్యం కాదు. ఈ సమస్యలను అధిగమించడానికి, వచ్చిన జవాబులను అప్పటికే ఉన్న ఇతర సమాచారంతో సరిపోల్చడం, ప్రశ్నపత్రంలోనే సరిపోల్చడానికి అవకాశం ఇచ్చే ఎదురుబొదురు ప్రశ్నలు సంధించడం వంటి పద్ధతులు కూడా ఉనికిలోకి వచ్చాయి. ప్రస్తుత సర్వే గణాంకాలలో “అగ్రవర్ణాలు”గా పేరు పొందిన ఆధిపత్య కులాల సిబిఐ స్కోర్ “అతి తక్కువ వెనుకబడినతనం”లో కాక కొంచెం భిన్నంగా ఉండడమే ఈ ఫలితాలతో సమస్య ఉందని చూపుతున్నది. ఈ సిబిఐ స్కోర్ ప్రకారం రెడ్డి (28), కరణం (27), కోమటి (25), బ్రాహ్మణ (22), కమ్మ (19), వెలమ (19) వంటి కులాల కన్న కాపు (12) కులం తక్కువ వెనుకబాటుతనంలో ఉన్నది!
ఇటువంటి సాంకేతిక సమస్యలు అలా ఉంచి, గతంలో బిహార్ కులగణన సందర్భంలో బైటపడిన రెండు అంశాలు ఈ కులగణనలో ఇంకా స్పష్టంగా కనబడుతున్నాయి: ఒకటి, ముస్లింలు మన సమాజంలో, ముఖ్యంగా గ్రామీణ సమాజంలో, ఒక మత సమూహంగా కాక, అన్ని కులాల్లో మరొక కులంగానే గుర్తింపు పొందుతున్నారు. రెండు, విడివిడిగా ఏ ఒక్క కులమూ జనసంఖ్య ఒక్కటే చూస్తే బలమైనది కాదు. మొత్తం 242 కులాల్లో జనాభాలో ఒక్కశాతం కన్నా ఎక్కువ ఉన్న కులాలు కేవలం 22 మాత్రమే.
వాటిలో కూడా ఐదు శాతం కన్నా ఎక్కువ ఉన్న కులాలు నాలుగు కన్నా ఎక్కువ లేవు. ఎక్కువ జనసంఖ్య ఉన్న కులాలు మాదిగ (10.3 శాతం), ముదిరాజ్ (7.4 శాతం), లంబాడీ (6.8 శాతం), యాదవ (5.7 శాతం), రెడ్డి (4.8 శాతం), గౌడ్ (4.6 శాతం), మాల (4.1 శాతం), మున్నూరు కాపు (3.9 శాతం), పద్మశాలి (3.3 శాతం), రజక (2.8 శాతం). ఏ కులానికీ చెందమని చెప్పుకున్నవారి జనాభానే ఇటువంటి హెచ్చు జనసంఖ్య ఉన్న కులాలతో సమానంగా 3.4 శాతంగా ఉంది. అంటే కులాల ప్రత్యేక అస్తిత్వమూ గుర్తింపూ ఎంత ముఖ్యమైనది అయినప్పటికీ, ఆ పేరు మీదనే సమీకరణలు జరుగుతున్నప్పటికీ, సమాజం మొత్తంగా చూస్తే ఏ ఒక్క కులమూ బలమైనది కాదు. కులాల మధ్య ఐక్యత ఇంకా ఎక్కువ అవసరమైనదని తేలుతుంది.ఇంత పెద్ద ఎత్తున వెనుకబాటుతనం ఉందనీ, వెనుకబాటుతనానికీ కులానికీ ఇంత సంబంధం ఉందనీ తెలిశాక ఇప్పుడు ఎటువంటి పాలనా విధానాల ద్వారా ఈ స్థితిని మార్చడం సాధ్యమో చెప్పడం రాజకీయ పక్షాల బాధ్యత. ముఖ్యంగా అధికారపక్షపు బాధ్యత. కులగణన మన సమాజ దుస్థితిని మన ముక్కు మీద గుద్ది చూపెడుతున్నది. ఈ దుస్థితిని మార్చడానికి ఏమి చేయాలని ఆలోచించడం మనందరి బాధ్యత.





