– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : రాష్ట్రంలో ‘ఎడ్యుకేషన్ జిహాద్’ తారస్థాయికి చేరిందని, హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థిని చేత కల్మా చదివించి, హోం వర్క్‌గా కల్మా, ‘సూరా అల్-ఫాతిహా’లను నేర్చుకుని పుస్తకాల్లో రాసుకుని ఇంటికి తీసుకెîళ్లాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ దుశ్చర్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని, ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస’ అంటూ ఆయన చేసిన ఓటు బ్యాంకు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల వల్లే ఇలాంటి తీవ్రవాద ఆలోచనలు ఉన్న శక్తులకు తెగింపు పెరిగిందని ఆయన మండిపడ్డారు. తన బిడ్డ చేత బలవంతంగా కల్మా రాయించడంపై పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన ఆ చిన్నారి తల్లి సాహసాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఇంతటి తీవ్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ పాఠశాల యాజమాన్యంపై ఇప్పటివరకు ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని రామచందర్‌రావు అన్నారు. ఒక ముస్లిం టీచర్‌ను బాధ్యత నుంచి తప్పిస్తే సరిపోదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యానిదేనని స్పష్టం చేశారు. హిందూ విద్యార్థులు, వారి కుటుంబాల భద్రత, ఆత్మగౌరవంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కళ్ళు మూసుకుని వ్యవహరిస్తోందన్నారు. హిందూ విద్యార్థులపై వారి మతానికి సంబంధం లేని ప్రార్థనలు, కల్మాలు బలవంతంగా రుద్దడం ఏమాత్రం సహించబోమని, కొన్ని కాన్వెంట్ స్కూళ్లలో హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకుని రాకూడదని ఒత్తిడి చేస్తూ మతాచారాలకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని రామచందర్‌రావు ఆరోపించారు. విద్యా సంస్థలు విద్యను అందించాలి తప్ప విద్యార్థులపై ఏ మతాన్నీ రుద్దే హక్కు ఎవరికీ లేదని, ప్రతీ విద్యార్థి రాజ్యాంగ హక్కును గౌరవించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు జరిపి పాఠశాల యాజమాన్యంతోపాటు ఈ ఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




