సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం

– గ‌త ప్ర‌భుత్వాల‌వ‌ల్ల సింగరేణి కార్మికుల్లో పెరిగిన అభద్రత
– సింగరేణి లైఫ్ లైన్ తాడిచెర్ల బ్లాక్ -2  బొగ్గు గని
– కేటీకే-8 గనిలో సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ,జూలై 14 : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సింగరేణి కార్మికులలో అభద్రత, ఆందోళన పెరిగిపోయిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని సింగరేణి కేటీకే-8 , తాడిచెర్ల బ్లాక్ 2 గనులలో సింగరేణి భరోసా యాత్రలో భాగంగా బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పని శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించ‌గా మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా దేశ అభివృద్ధికి ఇంధనంగా నిలుస్తున్న సింగరేణి కార్మికుల కృషి దేశానికి ఎంతో విలువైనదని కొనియాడారు. సింగరేణిని దేశంలోనే అత్యంత కీలకమైన ప్రభుత్వరంగ సంస్థగా బలోపేతం చేయాల్సిన గత ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్(డిఎంఎఫ్) నిధుల వినియోగంపై  రాష్ట్ర‌ ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జెన్‌కో సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.9,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ బకాయిల కారణంగా సంస్థపై అనవసర ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నామినేషన్ విధానంలో తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడంతో సింగరేణి లైఫ్ లైన్ తాడిచెర్ల బ్లాక్ -2 బొగ్గు గల్లీగా మారిందని అన్నారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిని మరింత బలోపేతం చేసి,పారదర్శక పాలనతో కార్మికుల సంక్షేమాన్ని కాపాడుతూ సంస్థను తిరిగి లాభాల బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. రామచంద్రరావు మాట్లాడుతూ సింగరేణి రాష్ట్ర‌ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిద‌ని చెప్పారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నీ బీజేపీ సహించదని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, బీజేపీ రాష్ట్ర, కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, బీఎంఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *