– అందుకే 2047 తెలంగాణ రైజింగ్ పాలసీకి రూపకల్పన
– 2034 నాటికి అమెజాన్ రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలి
– అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీ రూపొందించామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యసాధనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కీలకం అని, ఇందులో భాగంగా పరిశ్రమల కల్పనకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు, అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకంగా ఉపయోగపడనుందన్నారు. ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మించాలని ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రైంగ్ గ్లోబల్ సమ్మిట్‌ను 2025 డిసెంబర్‌లో నిర్వహించామని గుర్తు చేశారు. 2034 నాటికి అమెజాన్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అమెజాన్ సంస్థ పెట్టుబడులకు సంబంధించి ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామంటూ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని అమెజాన్‌కు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. పరిశ్రమలు, పర్యాటకం, ఎనర్జీ, ఆరోగ్యం, స్పోర్ట్స్ వంటి రంగాల్లో నిర్దిష్టమైన పాలసీలు రూపొందించామని, ఉద్యోగ కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించారు. అమెజాన్ లాంటి సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తే ఆ ప్రాంతాల్లో ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని, ఉద్యోగావకాశాలు కల్పనతోపాటు కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని, నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించే అవసరం ఉందని, మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ చేయాల్సి ఉందని తెలిపారు. మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, నగరంలో డీజిల్ మీద ఆధారపడి నడుస్తున్న రెండు లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయని, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌కు పన్నును పూర్తిగా మినహాయించి హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించామని, అభివృద్ధిలో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఈ ప్రాంత రైతులను మనస్పూర్తిగా అభినందిస్తున్నా
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల కోస భూములను త్యాగం చేసిన రైతులను ఎప్పటికీ ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుందన్నారు. భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి ముందుకొచ్చి సహకరించిన వారిని అభినందిస్తూ చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అవసరమైన నష్ట పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. భూమి ఇచ్చి అభివృద్ధికి సహకరించిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆందోళనలు చేపడుతున్న రైతులతో చర్చించాలని మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మా రెడ్డిలకు సూచిస్తున్నానంటూ భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని, మంచి నష్ట పరిహారాన్ని అందించాలని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





