– డేట్లు, డెడ్‌లైన్లు మారుతున్నాయి.. కార్డుల జారీ లేదు
– ప్రీమియం వసూలు చేసి పథకం అమలు చేయకపోవడం మోసమే
– బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రేవంత్ ప్రభుత్వం తీరు కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుంది అని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్‌కు హడావుడి ఎక్కువ.. అసలు విషయం తక్కువ అని, హెల్త్ కార్డులు ఇవ్వడంతోపాటు ఈరోజు నుంచే ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పిన మాటలు జూటా అని తేలిపోయిందని విమర్శించారు. పథకం అమలుకు మార్గదర్శకాల విడుదల లేదు.. నెట్‌వర్క్ హాస్పిటల్స్‌తో సంతృప్తికరమైన ఒప్పందం లేదు.. పథకం అమలు చేయకుండానే రెండు నెలలుగా ఉద్యోగుల జీతం, పెన్షన్ల నుంచి 1.5 శాతం కోత విధించిన సర్కారు పథకం అమలులో మాత్రం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఇచ్చిన హావిమీ 30 నెలలు గడుస్తున్నా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు, అన్ని హాస్పిటల్స్‌ల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి ఇంకెంత సమయం కావాలి అని ఆయన ప్రశ్నించారు. ముందు జూన్ 2 నుంచి హెల్త్ స్కీం అమలు చేస్తాం అన్నరు.. తర్వాత జులై 15 నుంచి అన్నరు.. అతీ లేదు గతీ లేదు..డేట్లు, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప హామీని మాత్రం లబెట్టుకోలేకపోతున్నారు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్ర ఏర్పాటులో, అభివృద్దిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్రను గుర్తించిన కేసీఆర్ రెండుసార్లు పీఆర్సీ, 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవించారని, పెన్షనర్ల వయస్సు పెరుగుతన్నకొద్దీ వారి అవసరాలు తీరేలా పెన్షన్ పెంచారని, ఒక్క రూపాయి తీసుకోకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు వెల్‌నెస్ సెంటర్లు, ఇతర హాస్పిటల్స్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలుందించారని వివరించారు. 1శాతం బేసిక్ పేతో మరింత పటిష్ఠంగా ఉద్యోగుల హెల్త్ స్కీం రూపొందించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లపై ఏమాత్రం కనికరం లేకుండా 1.5 శాతం కోత విధిస్తున్నదని, 30 నెలలు గడిచినా పీఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు, 6 డీఏల జాడే లేదు.. సీపీఎస్ రద్దు ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. పెన్షన్ బకాయిల అందక మానసిక వ్యథతో రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. మలి వయస్సులో పోరాటం చేయాల్సిన దుస్థితి కల్పించావని, హాస్పిటల్స్‌కు నిధులు చెల్లించకుండా పోలీసులకు భద్రత పథకాన్ని అటకెక్కించావని ఆరోపించారు.
జర్నలిస్టుల హెల్త్ కార్డులను గాలికి వదిలేసి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రశ్నార్థకం చేశావన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువున్నాయని విద్యా కమిషన్‌తో చెప్పించావు,. మొన్న రిటైర్డ్ ఇంజినీర్లను జైలుకు పంపుతానని బెదిరింపులకు పాల్పడ్డావు.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఎందుకు పగతో వ్యవహరిస్తున్నావు రేవంత్ రెడ్డీ అని హరీష్‌రావు నిలదీశారు. ఇప్పటికైనా మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే వారి పక్షాన బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్ధం అవుతుందని హెచ్చరించారు. హెల్త్ కార్డులు వెంటనే జారీ చేసి పథకం అమలు చేయకుండా కోత విధించిన డబ్బులను తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





