భీంగల్‌ ‌సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల దీక్ష

– గృహ నిర్బంధం చేసిన పోలీసులు
– పోలీసుల తీరుపై మండిపడ్డ వేముల

‌నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్‌ ‌ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి బుధ‌వారం ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. తాను తలపెట్టిన శాంతియుత కఠోర నిరాహార దీక్షను పోలీసు బలగాలతో అడ్డుకోవడం ప్రభుత్వ అప్రజాస్వామిక, రాక్షస చర్య అని ప్రశాంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీంగల్‌ 100 ‌పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వేముల డిమాండ్‌ ‌చేశారు. భీంగల్‌ ఇం‌టిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీంగల్‌ ‌బస్‌ ‌డిపోను పునఃప్రారంభించాలని కోరారు. గత మున్సిపల్‌ ఎన్నికల ముందు రూ.12 కోట్ల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ పెండింగ్‌ ‌పనుల సాధన కోసమే నేడు చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు కఠోర నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా, తనకు తాను శిక్ష వేసుకుంటూ అత్యంత శాంతియుతంగా ఒకరోజు దీక్ష చేస్తానని ప్రకటిస్తే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశాంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. తాను ఉదయం నిద్రలేవక ముందే, కనీసం స్నానం కూడా చేయకముందే వందలాది మంది పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని, భీంగల్‌ ‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించి, ప్లెక్సీలను సైతం చించేయడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ అభివృద్ధి పనులను నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను తక్షణమే ఈ ఒక్కరోజు దీక్ష విరమిస్తానని ప్రశాంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులతో బెదిరిస్తే భయపడేది లేదని తేల్చిచెప్పారు. ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనను ఇంట్లో నిర్బంధించినా, పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించినా, లేదా జైల్లో పెట్టినా తన సత్యాగ్రహం, కఠోర నిరాహార దీక్ష ఎక్కడ ఉంటే అక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు. భీంగల్‌ ‌పట్టణ, మండల ప్రజలు, యువత, కుల సంఘాలు, వీడీసీ  సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఈ న్యాయమైన పోరాటానికి, నిరాహార దీక్షకు మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రశాంత్‌ ‌రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు. ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలతో పాటు అరెస్టు చేసి పలు పోలీస్‌ ‌స్టేషన్లకు తరలించారు.  శాంతియుతంగా నిరసన చేయాలని తలపెట్టగా రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ఉదయం నుంచి నిర్బంధాలతో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తున్న‌దని ఆరోపించారు.

ఎమ్మెల్యేను నిర్బంధించడం దారుణం : హరీష్‌ ‌రావు ఫైర్‌

‌హైదరాబాద్‌ : నిజామాబాద్‌ ‌జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌ ‌రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డిప్యూటీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌హరీష్‌ ‌రావు తెలిపారు. భీంగల్‌ ‌మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల హాస్పిటల్‌ ‌నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్‌ ‌రెడ్డి నిర్ణయించుకుంటే ఆయనను పోలీసులు నిర్బంధించడం ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రతిపక్షాన్ని నిర్బంధించడం, పోలీసు రాజ్యాన్ని నడపడం రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులపై అణిచివేత చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *