తెలంగాణ ఉద్యమకారులకు ఏం కావాలి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే ప్రాథమిక డిమాండ్లపై మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాయి. విద్యార్థి జేఏసీలు ఏర్పడి ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారు. అనేక రాజకీయ కమిటీలు, సుదీర్ఘ చర్చల అనంతరం నాటి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను ఆమోదించింది. 2014 జూన్ 2న భారతదేశపు 29వ రాష్ట్రంగా తెలంగాణ అధికారికంగా అవతరించింది. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2014 నుండి పదేళ్లపాటు సాగిన బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పాలనలో అసలైన ఉద్యమకారులను, విద్యార్థి నాయకులను పూర్తిగా విస్మరించారు. కేవలం టిఆర్ఎస్  పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకు పదవులు వచ్చాయి. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారికి నామినేటెడ్ పదవులు లేదా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారు. కేసులు ఎదుర్కొన్న విద్యార్థులను పట్టించుకోలేదనే అసంతృప్తి ఉద్యమకారుల్లో బలంగా వ్యక్తమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమది “ప్రజా ప్రభుత్వం” అని ప్రకటించుకుంది. తాము ఉద్యమకారులకు సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చింది.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారులను గుర్తించి, వారి త్యాగాలను గౌరవించేందుకు మరియు వారికి అందాల్సిన ప్రయోజనాలను (పెన్షన్లు, నివేశన స్థలాలు, ఉపాధి మొదలైనవి) సిఫార్సు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్ గా సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కెకె ) ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ  లు ప్రొఫెసర్ కోదండరాం,  రాములు నాయక్, సీనియర్ నేత మోతే శోభన్ రెడ్డి వంటి కీలక ఉద్యమ నేతలు సభ్యులుగా ఉన్నారు. ఈ కేకే కమిటీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విద్యార్థి సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహిస్తూ, వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. మలిదశ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల తమ చదువులను, ఉద్యోగాలను, వారి విలువైన సమయంతో పాటు తమ ఆరోగ్యాలను కూడా కోల్పోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో ఉద్యమకారులు గుర్తింపుకు నోచుకోలేదు. కనీసం వారి పార్టీలో ఉన్న ఉద్యమకారులకు కూడా కెసిఆర్ అవకాశాలు ఇవ్వలేదు.
స్వరాష్టంలో దగాపడ్డ విద్యార్థి ఉద్యమకారులకు ఇప్పుడు కావాల్సింది తాత్కాలిక ఉపశమానం కాదు.. శాశ్వత పరిస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ పై ఇప్పుడు ఆ గురుతర బాధ్యత వుంది. ఇటువంటి సమయంలో ఉద్యమంలో పని చేసిన ప్రతి ఉద్యమకారునికి న్యాయం జరగాలంటే ఈ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం అమలుచేయాలి.
1)మొదటగా గత BRS ప్రభుత్వంలో గుర్తింపుకు నోచుకోని విద్యార్థి అమరవీరులను వెంటనే గుర్తించి వారి కుటుంబాలకు అండగా నిలవాలి.
2)అమరవీరుల స్మారకార్ధం ప్రతి యూనివర్సిటీ లో అమరవీరుల స్తూపాలు ఏర్పాటు చేయాలి.
3) తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలి.
4) ఉద్యమ కారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ /సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. దానికి కేబినెట్ హోదాలో చైర్మన్ ఉండాలి.
5) ప్రతి విద్యార్థి ఉద్యమకారునికి వారి జిల్లాను కేంద్రంగా చేసుకొని 250 గజాల స్థలం ఇచ్చి ప్రభుత్వమే త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించి ఇవ్వాలి.
 6)ఉద్యమకారుల పిల్లల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి.
7) RTC, సింగరేణి కార్మికులకు ఉన్నవిధంగా హైదరాబాద్ లో ప్రభుత్వం నిర్మిస్తున్న 4 టిమ్స్ హాస్పిటల్స్  లలో ఒకటి ఉద్యమకారుల హాస్పిటల్  గా ప్రకటించాలి.
8) ఆనాటి ఉద్యమకారులు చాలా వరకు యూనివర్సిటీలలో, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు, పార్ట్ టైమ్ టీచరర్లు పని చేస్తున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక నోటిఫికేషన్ వేయాలి.
 9) ప్రభుత్వం ఇప్పటి నుండి ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యమకారులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి.
 10) దళిత బంధు లాగా ఉద్యమకారుల బంధు ఏర్పాటు చేసి ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమకారునికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. రెండవ శ్రేణి నాయకులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి.
11) ఉద్యమకారులు వ్యాపారం, పరిశ్రమలు పెట్టుకునేందుకు ప్రభుత్వం 50 లక్షల నుండి 2 కోట్ల వరకు రుణాలను 50%సబ్సిడీతో ఇవ్వాలి.
12) ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పోస్టులు (కార్పొరేషన్, కమిషన్, ఫెడరేషన్, మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటిల్లో) తప్పనిసరిగా ఒక ఉద్యమకారునికి ఇచ్చేలా జీఓ  తేవాలి.
13) తెలంగాణ విద్యార్థి పోరాటాన్ని రికార్డ్ చేసి.. వారి పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.
14) తెలంగాణ ఆవిర్భావ దినం రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను ప్రత్యేక ఆహ్వానీతులుగా పిలవాలి.
కేకే కమిటీ ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి, కాలయాపన చేయకుండా, నిర్ధిష్ట సమయంలో నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి ఉద్యమకారులకు అండగా నిలవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *