– ఉత్తమ సేవల అంగన్‌వాడీ సిబ్బందికి ఆగస్టు 15న సన్మానం
– వచ్చే నెల నుంచి అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం
– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, విద్య, సంరక్షణ అందిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై మంత్రి సీతక్క సచివాలయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బలమైన భవిష్యత్తుకు బాల్యమే పునాది అన్నారు. ‘మీ పిల్లలు, మనవరాళ్ల వయస్సు ఉన్న చిన్నారులే అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్నారు.. వారిని సొంత పిల్లలుగా భావించి సేవ చేయాలి.. పిల్లలు అంగన్‌వాడీకి రావడం ఒక మెట్టు.. వారు హుషారుగా, ఆరోగ్యంగా ఎదగడం మరో ఎత్తు. వారి మేధాశక్తిని పెంచేలా మన సేవలు ఉండాలి’ అని అధికారులకు సూచించారు. గతంలో ఉమ్మడి జిల్లాలు చాలా పెద్దగా ఉండేవని, ప్రస్తుతం చిన్న జిల్లాలు ఏర్పడినందున మారుమÖల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా జిల్లా అధికారులు సందర్శించాలని మంత్రి ఆదేశించారు. డీడబ్ల్యూవోలు, సూపర్‌వైజర్లు భోజనం నాణ్యతను పరిశీలించేందుకు తరచూ అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం చేయాలని సూచించారు. గుడ్లు, పప్పు, పాలు, ఇతర పోషకాహార పదార్థాల ఇండెంట్, సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి సీతక్క హెచ్చరించారు. ‘మీకు నాణ్యమైన సరకులు రాకపోతే మాకు రిపోర్టు చేయండి.. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందాలి.. గర్భిణులు, బాలింతల విషయంలోనూ ఎలాంటి రాజీ ఉండదు.. మంచి జరిగినా, లోపం ఉన్నా మీ అనుభవాలను మాకు తెలియజేయండి.. వాటి ఆధారంగా సేవలను మరింత మెరుగుపరుస్తాం’ అని మంత్రి తెలిపారు. ఒకటి రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో నాసిరకం కోడి గుడ్లు సరఫరా చేశారని పత్రికల్లో వచ్చిన కథనాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆయా వార్తలపై జిల్లా అధికారులు వెంటనే సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్ పథకం మంచి ఫలితాలు ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల చిన్నారుల హాజరు పెరగడంతోపాటు వారి అభ్యాస సామర్థ్యం కూడా మెరుగుపడుతోందన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ పథకం అమలుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పిల్లల సంఖ్య పెరుగుదలపై నివేదికలు సిద్ధం చేయాలి
‘అమ్మ మాట-అంగన్‌వాడీ బాట’ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య ఎంత మేర పెరిగిందో జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. పాలు అందించడం వంటి నూతన కార్యక్రమాల ఫలితాలను కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన 2,500 నూతన అంగన్‌వాడీ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరాన్నిబట్టి భవిష్యత్తులో మరో 2,500 నుంచి 3,000 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. మంజూరైన భవనాలను నిర్దిష్ట గడువులో పూర్తి చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఒకేసారి ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, పైప్‌లైన్ నీటి కనెక్షన్ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేశారు. వలస కార్మికుల పిల్లల కోసం కార్మిక శాఖ సహకారంతో మొబైల్ అంగన్‌వాడీలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ మొబైల్ అంగన్‌వాడీలను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మారుమూల గుత్తికోయ గూడేల్లోని చిన్నారులకు కూడా పోషకాహారం, ఫీడింగ్ సేవలు పూర్తిస్థాయిలో అందాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క చిన్నారి ప్రభుత్వ సేవలకు దూరం కాకూడదన్నారు. సిబ్బంది ప్రవర్తన, క్రమశిక్షణ ఆదర్శంగా ఉండాలని, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి, వారి మానసిక వికాసానికి ఎలా తోడ్పడాలనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంగన్‌వాడీల్లో చిన్నారులకు రోజు వారి జీవితానికి అవసరమైన వివిధ అంశాలను పరిచయం చేస్తూ వారి మేధాశక్తి, గ్రహణ శక్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే 12 జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేసి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, ఒకటి రెండు రోజుల్లో మిగిలిన జిల్లాల్లోనూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని బాల్య వివాహాల రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మన పరిధిలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకూడదు.. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి అని స్పష్టం చేశారు. శిశు సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు దత్తత ప్రక్రియను వేగవంతం చేసి ప్రత్యేక దత్తత సంస్థల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బాగా పనిచేసే వారిని ఆగస్టు 15న సన్మానిద్దాం
అంగన్‌వాడీ వ్యవస్థలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, టీచర్లు, ఆయాలను గుర్తించాలని మంత్రి సూచించారు. ఆగస్టు 15 నాటికి ఉత్తమ సేవలందిస్తున్న వారిని ఎంపిక చేసి సన్మానించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు టీచర్లతో త్వరలో సమావేశమై వారి సమస్యలను వింటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే సిబ్బంది అనుభవాలు, సూచనలను స్వీకరించి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. వచ్చే నెల 16, 17 తేదీల్లో మళ్లీ సమీక్షిస్తా. ఈ నెల రోజుల కాలాన్ని సవాలుగా తీసుకుని పనిచేయండి అని మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు బి.అపర్ణ, మర్రిపల్లి చందన, ప్రేమలతా అగర్వాల్, కంచర్ల వందనగౌడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా, టీజీ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ మోతి, పంచాయతీరాజ్ ఈఎన్సీ జోగారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





