– మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ సర్కారే
– సొంత రాష్ట్రాన్నే తిట్టే దౌర్భాగ్యుడు రేవంత్
– రైతులు లబోదిబోమంటున్నా పట్టించుకునేటోడే లేడు
– కెసిఆర్ పట్టాలు ఎక్కితేనే రాష్ట్రం గాడిన పడుతుంది
– బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
– బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 04: కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలు, అబద్ధపు హామీలను నమ్మి ఓటు వేసి మోసపోయి రెండున్నర ఏళ్ళు గోసపడ్డామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఆయన సిరిసిల్ల పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా 200 మందితో పార్టీలో చేరిన సిరిసిల్ల మున్సిపల్ పదో వార్డు తాజా, మాజీ కౌన్సిలర్ దంపతులు బోల్గాం వైష్ణవి నాగరాజులకు కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్సేనని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల అమలు మాటెత్తితే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు తిడుతున్నాడని, ఢిల్లీలో సొంత రాష్ట్రాన్ని తిట్టేన దౌర్భాగ్యుడని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాక రైతులు లబోదిబోమంటున్న పట్టించుకున్న నాధుడే లేడని విమర్శించారు. రెండున్నర ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను రాచిరంపాన పెడుతున్నారని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1200 మంది రైతులు మరణించారని గుర్తు చేశారు. మహిళలకు రెండున్నర వేలు ఇవ్వనోడు కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తాడని ప్రశ్నించారు. ఇటీవల కరీంనగర్ లో దొంగలు కాల్పులు జరిపి మరీ దోచుకోవడం ఎంత దారుణమని, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, అధికారులు రాష్ట్రాన్ని దొంగల్లా దోచుకుంటున్నారని ఆరోపించారు. సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ ద్వారా చెరువులు నింపి, వ్యవసాయ రంగానికి నీళ్లు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ప్రజలందరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మళ్లీ కెసిఆర్ పట్టాలు ఎక్కితేనే రాష్ట్రం గాడిన పడుతుందన్నారు. పదో వార్డు చిన్న బోనాల ఊరంతా ఒక్కటి కావడం సంతోషంగా ఉందని, పంచాయతీలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారు. వార్డులో పోచమ్మ గుడి నిర్మాణంతోపాటు మల్కపేట రిజర్వాయర్ నుండి వార్డు చెరువులోకి నీరు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, రాష్ట్ర నాయకులు గూడూరీ ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, మ్యాన రవి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




