తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతం

– ద్రవిడ పార్టీల పాలనకు చరమగీతం
– అనూహ్యంగా దూసుకొచ్చిన విజయ్ పార్టీ
– మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా టీవీకే
– ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు
– సీఎం స్టాలిన్ ఘోర పరాజయం
– ఆయన బాటలోనే అత్యధిక మంత్రులు

చెన్నై, మే 4: తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్క్నతమయ్యింది. అనూహ్యంగా దూసుచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) జెండా పాతింది. ఎగ్జిట్‌పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ద్రవిడ పార్టీలను మట్టి కరిపించింది. తమిళనాట హిందీ వ్యతిరేకత, దక్షిణాదికి అన్యాయం అంటూ హూంకరించిన సీఎం స్టాలిన్ పార్టీ ఓడడమే గాకుండా ఆయన కూడా ఓడిపోయారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళసై సైతం వరుసగా రెండోసారి ఓటమి దిశలో ఉన్నారు. ఒకప్పటి తన అనుచరుడు, డీఎంకె పార్టీ నేత చేతిలో దారుణంగా ఓటమి చెందారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం విజయం దిశగా ఉన్నారు. మంత్రులు చాలామంది ఇంటి ముఖం పట్టారు. ఇక టీవీకే చీఫ్ విజయ్ పెరంబూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజా సమాచారం ప్రకారం టీవీకే 109 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. 59 స్థానాల్లో డీఎంకే, 44 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. చెన్నై, చంగల్‌పట్టు, కంచీపురం, తిరువల్లూరులో టీవీకే విజయ కేతనం ఎగురవేసింది. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో ద్రావిడ్ పార్టీల ఆధిపత్యం ఉండేది. సెంట్రల్ తమిళనాడులోనూ టీవీకే మంచి పోటీ ఇచ్చింది. తిరుచిరాపల్లి, తాంజావురు, కరూర్, పెరంబలూరు, అరియాలూరు, నాగపట్టణం, తిరువరూరు, పుడుకొట్టై, మలదుతరై జిల్లాలో టివికె గట్టి పోటీనిచ్చింది. దీంతో దళపతి ఇక కొత్త సిఎంగా కావడం అనివార్యం అయ్యింది. చిన్నాచితక పార్టీలు లేదా అన్నాడీఎంకేతో పొత్తు కుదిరితే సరిపోతుంది. మొత్తంగా ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీలను విస్మయానికి గురిచేశారు. సినిమా స్టార్‌లు రాజకీయాల్లో రాణించలేరన్న అపవాదును చెరిపివేస్తూ విజయ్ తన సినీ పాపులారిటీని వోట్లుగా మార్చుకోవడంలో సఫలమయ్యారు. తద్వారా దివంగత నేతలు ఎన్టీ రామారావు, ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి దిగ్గజాల సరసన ఆయన నిలిచారు. 1977 తర్వాత తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కాక మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం ఇదే తొలిసారి. పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ ’ఇది కుటుంబ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. ఎవరి మద్దతు లేకుండానే తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ నివాసం వద్ద ఆయన కుటుంబ సభ్యులు పార్టీ గుర్తు అయిన ’విజిల’ సాంగ్‌తో సంబరాలు చేసుకున్నారు. మెజారిటీ మార్కు 118కి టీవీకే చేరువలో ఉంది. చిన్న పార్టీల మద్దతుతో లేదా స్వతంత్రంగా విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ జెండాలు ఊపుతూ పండగ చేసుకున్నారు. ఇక ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయారు. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో తొమ్మిది వేల వోట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కొళత్తూరు నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సీఎం ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. వీఎస్ బాబుకు 82 వేల పైచిలుకు వోట్లు రాగా స్టాలిన్‌కు దాదాపు 73 వేల వోట్లు పోలయ్యాయి. అన్నాడీఎమ్‌కేకు చెందిన సంతానకృష్ణన్ 14 వేల వోట్లతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు. 1996 తర్వాత స్టాలిన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 1996 తరువాత డీఎమ్‌కే అధినేతకు వోటమి ఎదురు కావడం ఇదే తొలిసారి. వీఎస్ బాబు గతంలో డీఎమ్‌కే, ఏఐఏడీఎమ్‌కే పార్టీల్లో సేవలందించారు. 2006-11 మధ్య పురసవల్కం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2011 వరకూ డీఎమ్‌కే ఉత్తర చెన్నై డిస్ట్రిక్ట్ సెక్రటరీగా, 2011 నాటి ఎన్నికల్లో కొళత్తూర్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్నారు. అనంతరం అన్నాడీఎమ్‌కేలో చేరి ఈ ఏడాది నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకేలో చేరారు. టీవీకే మెజారిటీకి అతి దగ్గరలో ఆగిపోయిన పక్షంలో అన్నా డీఎంకే మద్దతు తీసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. కాగా, సెక్యులర్ ప్రొగ్రసివ్ అలెయెన్స్‌లో భాగంగా డీఎంకేతో కాంగ్రెస్, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 5 స్థానాల్లో, సీపీఐ రెండు స్థానాల్లో, సీపీఎం ఒక స్థానంలో గెలుపునకు చేరువలో ఉన్నాయి. డీఎంకేతో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆ పార్టీలోని కొందరు టీవీకే పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌లోని ఒక వర్గం మొదట్నించీ పట్టుబట్టగా చివరి నిమిషంలో డీఎంకేతోనే కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నట్టు విశ్లేషకుల అంచనా. కాగా. ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా టీవీకే కాంగ్రెస్‌తోపాటు ఐయూఎంఎల్, డీఎండీకే, లెప్ట్ పార్టీల సాయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. డాక్టర్ అన్బుమణి రామదాస్ సారథ్యంలోని పీఎంకే మద్దతును కూడా టీవీకే కూడగట్టవచ్చని చెబుతున్నారు.

—————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *