వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం ….
రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే పూర్తి చేశాం..
వర్గీకరణతో ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ఉద్దేశం
దళిత సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రికి అభినందనల వెల్లువ
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎస్సీ సంఘాల నాయకులు అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో మాదిగ సంఘాల నేతలు తరలివచ్చి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీ ధన్యవాదాలు తనకు మాత్రమే కాదు.. మన నాయకుడు రాహుల్ గాంధీకి కూడా తెలియజేయాలని కోరారు.
రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి తనకు వొచ్చేది కాదని తెలిపారు. భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చింది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసింది కాదు. వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం, ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వొచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపాం. సుప్రీం కోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వొచ్చేందుకు కృషి చేశాం.
సుప్రీం కోర్టు తీర్పును దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదు. కానీ మేం అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టాం. న్యాయపరమైన హక్కుల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం.. ఇప్పుడు సాధించుకున్నాం. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ ను నియమించాం. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ ఖాసీం గారిని నియమించాం. ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చాం. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వొస్తాయి.
ఇదొక గొప్ప అవకాశం.. ఇది పది మందికి ఉపయోగపడేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కుర్చీలో మీ వాడిగా తాను కూర్చున్నానని, మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆవేశం తగ్గించుకొని ఆలోచనతో పనిచేయాలని, వొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.