లౌకికవాదానికి, అభివృద్ధికే తమిళుల పట్టం

– తమిళనాడులో డీఎంకే కూటమిదే విజయం
– తెలంగాణలో హామీలను అమలు చేశాం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాణిపేట జిల్లా షోలింగర్ నియోజకవర్గంలో నీ కారిక్కల్, వీరనట్టుర్, అరియూర్, అయిపేడు ప్రాంతాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తమిళ ప్రజలు అభివృద్ధి, లోకికవాదానికే పట్టం కడతారని చెప్పారు. ఆత్మగౌరవానికి తమిళ ప్రజల మద్దతు చెబుతారని ఆకాంక్షించారు. సీఎం ఎం.కె.స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్నికలవేళ ఇచ్చిన హామీలేకాÅ£ ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నదని తెలిపారు. అనుమానం ఉంటే ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చని అన్నారు. రైతు భరోసా కింద రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేసినటు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం పంపిణీ, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.

తమిళనాడు అంటే ఒక సిద్ధాంతం

తమిళనాడు రాజకీయాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు.. అదొక గొప్ప సిద్ధాంతం అని చెప్పారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి వంటి మహనీయులు ఇక్కడ సామాజిక న్యాయానికి బలమైన పునాదులు వేశారన్నారు. దిల్లీ పీఠంపై ఉన్న పాలకులు తమిళ సంస్కృతిని, భాషను, హక్కులను అణచివేయాలని చూస్తున్నారని భట్టి విమర్శించారు. ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే సెక్యులర్ శక్తుల ఐక్యత అనివార్యమని, అందుకే స్టాలిన్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వోటు

రాహుల్ గాంధీ అందిస్తున్న ప్రేమ సందేశం, స్టాలిన్ చేపట్టిన అభివృద్ధి నినాదం ఒక్కటయ్యాయని భట్టి పేర్కొన్నారు. తమిళ ప్రజలు వేసే వోటు కేవలం ఒక గుర్తుపై వేసే ముద్ర కాదని, అది విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వినిపించే ప్రజాస్వామ్య గొంతుక అని వ్యాఖ్యానించారు. నియంతృత్వాన్ని ఓడించి విద్వేషం లేని సమాజాన్ని నిర్మించుకోవాలని, ఇక్కడ కేవలం ప్రేమకు, సమధర్మానికి మాత్రమే చోటు ఉందని నిరూపించాలని కోరారు. తెలంగాణ స్ఫూర్తితో తమిళనాడులో కూడా అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే డీఎంకే-కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని భట్టి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *