– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో తనను మంగళవారం కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధకులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధనలు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలంగాణ అత్యంత అనుకూలమని వివరించారు. ఔషధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో తమ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఇక్కడి బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధునిక వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణాను కేంద్ర స్థానం (హబ్)గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తోందని తెలిపారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించే విషయంలో చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపంచంలోని అతి పెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూనివర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటి సలహాదారు ఐ.సాయికృష్ణ టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ రఘురామ శర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.