– తెలంగాణకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ రక్షణ కవచం
– రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్1: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకుంటూ నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల మీద దశాబ్దాలపాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామని, పరిపాలన చేతగాదు అని విమర్శించిన నోళ్లు మూతపడేలా ప్రగతి పాలనను అందించామని కేసీఆర్ అన్నారు. నూతన రాష్ట్రంగా ఏర్పాటైన పదేండ్ల అనతికా లంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి, తెలం గాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని వివరించారు. సాగునీ రు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. రైతన్న సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించకూడదని హితవు పలికారు. రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు, సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కేసీఆర్ కోరుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





