ఫార్మా, ఇథనాల్ ఏ పరిశ్రమకైనా తమ సాగుభూములను ఇచ్చేదేలేదంటున్నారు రైతులు. జీవనాధారమైన పంట పొలాలను ఇచ్చి తమ భవిష్యత్‌ను తామే అంధకారంలో పడేసుకోలేమంటున్నారు. ప్రాణాలైన అడ్డుపెట్టుకుని తమ భూములను కాపాడుకుంటామంటున్న రైతుల ఆందోళనకు ప్రభుత్వం దిగిరాక తప్పడం లేదు. లగచర్ల ఘటనపై ఇంకా విచారణ పూర్తి కాకుండానే ఇథనాల్ మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఆర్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి వొస్తున్నది. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గత మూడురోజులుగా చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆందోళన తీవ్రతరం కావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
కలెక్టర్ అభిలాష్ అభినవ్‌తో పరిశ్రమ పనులను నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పించింది. అయితే ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారా లేక పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తారా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే పనులను నిపివేయాల్సిందిగా ప్రకటించిన కలెక్టర్ అయిదుగురు రైతులను సమావేశానికి ఆహ్వానించడం చూస్తే మరో విధంగా వారిని ఒప్పించే పనిలో ప్రభుత్వం ఉందేమోనని పిస్తున్నది. ఇదిలా ఉంటే వాస్తవంగా ఈ ఘటనను గత ప్రభుత్వ మెడకు చుట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇక్కడ ఒక ప్రైవేటు సంస్థకు ఇథనాల్ పరిశ్రమను నెలకొల్పే అనుమతిని గత ప్రభుత్వం ఇచ్చిందనీ , అయితే రైతులు, ప్రజల నుంచి వొస్తున్న వ్యతిరేకత దృష్ట్యా అవసరమైతే పరిశ్ర అనుమతులను రద్దు చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని కలెక్టర్ ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్పించింది.
కొద్ది రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరి ఏర్పాటును వ్యతిరేకిస్తూ దిలావర్‌పూర్ తోపాటు గుండుపల్లి, సమందర్‌పల్లి, రత్నాపూర్ గ్రామాలకు చెందిన రైతులు, వ్యాపారస్తులు, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పైన వంటావార్పు చేపట్టడంతో దాదాపు పది కిలోమీటర్ల మేర రహదారి ఇరువైపులా వాహనాలను నిలిపేశారు. తమ పంట పొలాల్లో కాలుష్యం నింపే పరిశ్రమల అనుమతి రద్దు చేయాలంటూ మహిళలు కూడా పురుగుమందు డబ్బాలు పట్టుకోవడంతో ఆందోళన చెయ్యి దాటి పోయే ప్రమాదం ఏర్పడడంతో పోలీసుల జోక్యం అనివార్యమైంది. ఇప్పటికే లగచర్ల ఘటన ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక్కడ ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కూడా ప్రైవేటు సంస్థ ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం బలవంతపు భూసేకరణను స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మొదటినుండీ పోరాడిన ఈ నేలపైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా అన్యాయం జరగడాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండిస్తున్నారు.
పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, పచ్చని పంట పొలాలను కలుషితం చేసే ఫ్యాక్టరీలకు భూములను ఇవ్వడాన్ని తాము ససేమిరా అంగీకరించేది లేదంటున్నారు అన్నదాతలు. ఒకపక్క వ్యవసాయరంగాన్ని అభివృద్ది చేస్తామని చెబుతూనే మరో పక్క ఆ రంగాన్ని విధ్వంసం చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిశ్రలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతున్న విషయం తెలిసి కూడా ప్రభుత్వాలు రైతుల నుండి బలవంతంగా పంట భూములను లాక్కొని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడాన్ని పర్యావరణ వేత్తలు కూడా ఆక్షేపిస్తున్నారు. ఇందుకు చిత్తనూర్‌లోని ఇథనాల్ ఫ్యాక్టరీని వారు ఉదహరిస్తున్నారు. అందుకే వాతావరణాన్ని కలుషితం చేసే ఫార్మా కంపెనీలకైన, ఇథనాల్ పరిశ్రమకైనా తమ భూములు ఇవ్వమని, మా భూములు మాకే కావాలన్న నినాదంతో ఆందోళన చేపట్టిన రైతుల ఆక్రందనలతో అటు వికారాబాద్, ఇటు నిర్మల్ జిల్లాల్లో అట్టుడికి పోతున్నది.
వీటికి మరో దామగుండం కూడా తోడైంది. ఇదే వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో కేంద్ర నౌకాయానశాఖ రాడార్ స్టేషన్ ఏర్పాటును పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం అక్టోబర్ 15న దానికి శంఖుస్థాపనకూడా జరిగిపోయింది. ప్రభుత్వ ఆధీనంలోని అటవి భూముల్లోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ, ఇప్పటికే పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతున్న పరిస్థితిలో ఈ రాడార్ కేంద్రంవల్ల మరింత విఘాతం ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ పునరుద్దరణకు నడుంకట్టుకున్న విషయం తెలియంది కాదు. అలాంటి మూసీ జన్మస్థానమైన అటవిప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ రాడార్ వల్ల మూసీ అంతర్థానం అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇక్కడున్న 3216 ఎకరాల అటవిలో 2901 ఎకరాలు రాడార్ స్టేషన్‌కు కేటాయించడమే కాకుండా, ఇక్కడ 12 లక్షల చెట్లను తొలగించే ప్రమాదముందంటున్నారు. అంతేకాదు, 208 రకాల జీవరాసులు కూడా అంతర్ధానమయ్యే ప్రమాదముంది . అయినా ప్రభుత్వం ముందుకెళ్లేందుకు సంకల్పించుకోవడంపట్ల పర్యావరణవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.