రూ.500 బోనస్ చెల్లింపుతో అన్న‌దాత‌ల్లో ఆనందం

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి
రైతుల‌కు వెనువెంట‌నే స‌క్ర‌మంగా చెల్లింపులు జ‌ర‌గాలి
మంత్రులు, అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించాలి..
వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు.

సన్నరకం పండించిన రైతులకు బోనస్ గా రూ.500 ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.  సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా  సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిఎం ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్చార్జి మంత్రులు, ఇన్చార్జి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా, మిల్లులకు ధాన్యం కోసం లారీల ఇబ్బంది లేకుండా చూడాలి. కొనుగోలు కేంద్రాలకు వొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో ఈ ప్రజా ప్రభుత్వం అన్ని పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో 66లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారు. ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉంది.

సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వొస్తుంది. ఆ ధాన్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. .ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగను జరుపబోతున్నాం. దానిని పురస్కరించుకొని 28, 29, 30వ‌ తేదీల్లో మహబూబ్ నగర్ లో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో రైతు అవగాహన‌ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 30న జరిగే రైతు పండుగను కలెక్టర్లు అందరు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రైతులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ప్రజలకు చేరే విధంగా విస్తృత ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page