పశ్చిమ ఆసియా పై మళ్లీ యుద్ధ మేఘాలు…

పశ్చిమ ఆసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతల అగ్నికుండంగా మారుతోంది. శాంతి చర్చలు జరుగుతున్నాయనే సంకేతాలు వెలువడుతుండగానే యుద్ధ వాతావరణం తిరిగి ముదురడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే పరిస్థితి మళ్లీ “కైనెటిక్” దశకు చేరుకుంది. అంటే ప్రత్యక్ష సాయుధ దాడులు, క్షిపణి దాడులు, సముద్ర ఉద్రిక్తతలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాలు కేవలం ప్రాంతీయ సమస్యలుగానే మిగలవు…ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, అంతర్జాతీయ రాజకీయ సమతౌల్యాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

అమెరికా ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రంపై దాడి చేసినట్లు వొచ్చిన వార్తలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. అలాగే హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన నౌకలు మైన్లు అమర్చేందుకు ప్రయత్నించాయని అమెరికా ఆరోపిస్తోంది. ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచంలో సముద్ర మార్గంలో తరలే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ఇక్కడ చిన్న అంతరాయం జరిగినా అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడతాయి. భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది భారీ ఆర్థిక దెబ్బ.

ఇరాన్ కూడా తక్కువేమీ కాదు. అమెరికాకు చెందిన “హోస్టైల్” స్టెల్త్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ప్రకటించింది. సముద్రంలో ఓ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే యుద్ధం ఇక కేవలం భూభాగానికే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. సముద్ర మార్గాలు, డ్రోన్ యుద్ధాలు, సైబర్ దాడులు, అండర్‌వాటర్ ఆయుధాలు వంటి ఆధునిక యుద్ధ వ్యూహాలు ఈ ఘర్షణను మరింత ప్రమాదకరంగా మార్చుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌లో ఇరాన్ మద్దతుగల మిలీషియాపై దాడులను ముమ్మరం చేయడం గమనార్హం. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం అధికారికంగా ప్రకటించబడకపోయినా, ప్రాక్సీ యుద్ధాల రూపంలో పోరాటం కొనసాగుతూనే ఉంది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా, గాజాలో హమాస్, యెమెన్‌లో హౌతీలు వంటి గ్రూపులు ఈ ప్రాంతాన్ని శాశ్వత అస్థిరతలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా చేపట్టిన “అబ్రహాం ఒప్పందాలు” కూడా శాశ్వత శాంతిని తీసుకురాలేకపోతున్నాయి.

అమెరికా లక్ష్యం స్పష్టంగా ఉంది. పశ్చిమ ఆసియాలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించడం, ఇజ్రాయెల్ భద్రతను కాపాడడం, ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలను నియంత్రించడం. అయితే ఇరాన్‌ను పూర్తిగా ఒత్తిడితో వశపరచడం అంత సులభం కాదు. అణు కార్యక్రమంపై అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలు, ఆర్థిక నిషేధాలు ఇరాన్‌ను మరింత దూకుడుగా మారుస్తున్నాయి. ఇరాన్‌కు చైనా, రష్యా వంటి దేశాల మద్దతు కూడా పెరుగుతోంది. దీంతో ప్రపంచం మళ్లీ రెండు శక్తి బ్లాకులుగా విడిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే ప్రభావం చూపుతోంది. చమురు ధరలు పెరిగితే భారతదేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం మరింత తీవ్రమవుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. మధ్యతరగతి, పేదల జీవితం మరింత భారమవుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, సరఫరా గొలుసుల అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో పశ్చిమ ఆసియా యుద్ధం మరింత ప్రమాదకర పరిణామాలకు దారితీయవొచ్చు .

ఇక్కడ అమెరికా కూడా ఒక వాస్తవాన్ని అంగీకరించాల్సిందే. ఇరాన్‌ను పూర్తిగా ఒంటరిచేసి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఒత్తిడి చేయడం కంటే, కొన్ని డిమాండ్లలో సడలింపు ఇవ్వడం ప్రపంచ ప్రయోజనాలకు అనుకూలం కావొచ్చు . ఎందుకంటే యుద్ధం కొనసాగితే దాని మూల్యం మొత్తం ప్రపంచమే చెల్లించాల్సి వొస్తుంది . అమెరికా ఆర్థిక వ్యవస్థకూ భారీ ఖర్చు తప్పదు. అంతేకాదు, హోర్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిస్థితులు ఏర్పడితే ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యే ప్రమాదం ఉంది.

శాంతి ఒప్పందాలు కేవలం రాజకీయ ప్రకటనలతో సాధ్యం కావు. పరస్పర సందేహాలు,అనుమానాలు, శక్తి రాజకీయాలు, ఆయుధ వ్యాపారం, భౌగోళిక ఆధిపత్య పోటీలు తగ్గినప్పుడే నిజమైన శాంతి సాధ్యమవుతుంది. పశ్చిమ ఆసియా మళ్లీ యుద్ధపు దుమ్ము తుఫానులో చిక్కుకుంటే దాని ప్రభావం ప్రపంచంలోని ప్రతి దేశానికీ తాకుతుంది. అందుకే యుద్ధ భాష కంటే సంభాషణల మార్గానికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు అత్యవసరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *