గోదావరి తీరాన ‘దక్షిణకాశి’ వైభవం

– ఎంతో చరిత్ర ఉన్న క్షేత్రం
– రాబోవు గోదావ‌రి పుష్క‌రాల‌కు నిధుల సంగ‌తేమిటి?
– బాస‌ర -భ‌ద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌
– 2027 పుష్కరాల స‌న్న‌ద్ధ‌త‌-స‌వాళ్లు

                                                                                            (రామ కిష్టయ్య సంగన భట్ల
                                                         సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్-9440595494)

గోదావరి పుష్కరాలు అనగానే సాధారణంగా అందరి మదిలోనూ మెదిలే మొదటి పేరు రాజమహేంద్రవరం. అయితే అంతటి ప్రాచీన పౌరాణిక వైభవం, చారిత్రక నేపథ్యం ఉన్న గోదావరి నదీ తీర సంస్కృతి కేవలం ఆంధ్ర ప్రాంతానికే పరిమితం కాలేదు. సహస్రాబ్దాల ఆధ్యాత్మిక వారసత్వాన్ని తన గర్భంలో దాచుకున్న తెలంగాణలోని గోదావరి తీర క్షేత్రాలు కూడా పుష్కరాల సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన, సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఈ సుదీర్ఘ నదీ పరివాహక ప్రాంతంలో ‘దక్షిణకాశి’గా, వైష్ణవ-శైవ సంప్రదాయాల సంగమ క్షేత్రంగా విరాజిల్లుతున్న జగత్ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి. జగజ్జనకుడు బ్రహ్మదేవుడు, లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి, యమధర్మరాజు, శివుడు ఒకేచోట కొలువై ఉన్న త్రిమూర్తి సాన్నిధ్య వైభవం, వేదపారాయణ సంప్రదాయాలు కలగలిసిన ధర్మపురి క్షేత్రానికి గోదావరి పుష్కరాల చరిత్రలో ఒక ప్రత్యేకమైన, అద్వితీయమైన స్థానం ఉంది.

ధర్మపురి పుష్కరాల ఆధునిక చరిత్ర  

ధర్మపురి పుష్కరాల ఆధునిక చరిత్రను పరిశీలిస్తే 2003 జూలై 30 నుంచి ఆగస్టు 10 వరకు జరిగిన ఉత్సవాలు ఒక మైలురాయిగా నిలిచాయి. ఆ సమయంలో ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి పర్యవేక్షణలో గోదావరి నదీ తీరాన అత్యంత వైభవంగా నిర్వహించిన శతచండీ సహిత ఋగ్వేద సంహితా యాగం ఆధ్యాత్మిక లోకాన్ని ఎంతగానో ఆకర్షించింది. విశేషమేమిటంటే, అప్పట్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అగ్రభాగాన నిలిచి నడిపిస్తున్న అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ యాగానికి రాజకీయాలకతీతంగా పూర్తి అండదండలు అందించారు. పార్టీ నిధుల నుండి లక్షల విరాళాన్ని సమకూర్చడమే కాక పుష్కరాల తొలి రోజే సతీసమేతంగా ధర్మపురి ఘాట్‌లో పవిత్ర స్నానమాచరించారు. ఆ సమయంలో ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి అని గోదావరి తల్లికి మొక్కుకోవడం, ఆ తర్వాతి కాలంలో అది సాకారం కావడం గమనార్హం. కాలక్రమంలో ఉద్యమం ఫలించి రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తన పూర్వ సంకల్పాన్ని మరువలేదు. 12 ఏళ్లకు అంటే 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగిన గోదావరి మహా పుష్కరాల (ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే బృహత్తర సంప్రదాయం) సందర్భంగా ఆయన ధర్మపురి క్షేత్రాన్ని ఎంచుకుని ప్రారంభ స్నాన సంకల్పం చేయడం విశేషం. గోదావరి తల్లికి కృతజ్ఞతగా సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నాడు తాము మొక్కుకున్న మొక్కుబడి కింద ఒక అద్భుతమైన స్వర్ణకంకణాన్ని తయారు చేయించి తెచ్చారు. ఆ స్వర్ణకంకణాన్ని దేవస్థాన ఆస్థాన వేదపండితుని హస్తానికి స్వయంగా తొడిగి తన భక్తిని చాటుకున్నారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న కొప్పుల ఈశ్వర్ చొరవతో ధర్మపురి రూపురేఖలు మార్చడానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. స్నానఘట్టాల విస్తరణ, రహదారుల వెడల్పు, తాత్కాలిక వసతులు, పారిశుద్ధ్య ఏర్పాట్లు ముమ్మరంగా సాగాయి. భక్తుల సంఖ్య అంచనాలను మించిపోవడంతో 2015 మహా పుష్కరాలు పాలకులకు, అధికారులకు ఒక పెద్ద పరీక్షగా మారాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలోని వివిధ గోదావరి ఘాట్లకు దాదాపు ఐదు కోట్లకు పైగా భక్తులు తరలిరాగా, అందులో అత్యధిక శాతం మంది ధర్మపురి క్షేత్రానికే పోటెత్తారు. ఫలితంగా ధర్మపురి పరిసర ప్రాంతాలలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. ఎంతలా అంటే, అప్పటి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ వంటి ప్రముఖులే సాధారణ ప్రజలతో పాటు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనలు భవిష్యత్తులో రాబోయే పుష్కరాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు సరిపోవని, శాశ్వత మౌలిక వసతుల కల్పన, కఠినమైన ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలు ఎంత అత్యవసరమో స్పష్టమైన పాఠాలను నేర్పాయి.

ఈ గత అనుభవాలు, సవాళ్ల నేపథ్యంలో.. 

గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు అత్యంత వైభవంగా  జరగబోయే రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభం కావడం శుభపరిణామం. ప్రస్తుత జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఎదురైన రద్దీ సమస్యలను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డికి నివేదించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అందులో \లక్ష్మణ్‌ కుమార్‌ను కీలక సభ్యునిగా నియమించింది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ కమిషనర్, ఆలయ స్థపతి, ఆగమ సలహాదారులు, జిల్లా కలెక్టర్‌తో కూడిన అధికారుల బృందం ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి ఘాట్ల విస్తరణ, శాశ్వత పార్కింగ్ స్థలాల గుర్తింపు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలపై నివేదికలను సిద్ధం చేసింది.

బాసర నుంచి భద్రాచలం వరకు అనుసంధానం

రాష్ట్ర ప్రభుత్వం కేవలం ధర్మపురినే కాకుండా బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న యావత్ గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఒకే మాలగా అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక పర్యాటక కారిడార్‌గా మార్చాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా బాసర జ్ఞానసరస్వతి ఆలయాన్ని, కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రాన్ని సందర్శించి పనులను సమీక్షించారు. శనివారం ధర్మపురి సమీపంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం కూడా ఈ వ్యూహాత్మక అభివృద్ధిలో భాగమేనని చెప్పవచ్చు.

బ‌హిర్గతం కాని నిధులు, మాస్టర్ ప్లాన్ వివ‌రాలు

ఇదిలా ఉంటే, బాసర, కాళేశ్వరం, భద్రాచలం క్షేత్రాలకు అందుతున్న ప్రచారం, నిధుల ప్రకటనల జోరుతో పోలిస్తే ధర్మపురి క్షేత్రానికి సంబంధించి ఇంకా నిర్దిష్టమైన మాస్టర్ ప్లాన్, కేటాయించే నిధుల అధికారిక వివరాలు పూర్తిస్థాయిలో బహిర్గతం కాకపోవడం స్థానిక భక్తులు, ఆలయాభిమానులలో కొంత ఆందోళనను, అసంతృప్తిని కలిగిస్తోంది. ‘దక్షిణకాశి’ అనే సముచిత గౌరవానికి తగ్గట్టుగా ధర్మపురిలో నదీ తీర రక్షణ గోడలు (రిటైనింగ్ వాల్స్), శాశ్వత భక్త నివాస సముదాయాలు, ఆధునిక శ్మశాన వాటికలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి పటిష్టమైన పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభం కావాలని క్షేత్రవాసులు కోరుతున్నారు. నిజానికి, గోదావరి పుష్కరాలు అనేవి కేవలం పన్నెండు రోజుల పాటు జరిగే ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు. అవి ఆయా ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని చాటడమే కాక స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, పర్యాటక రంగాన్ని విస్తరించడానికి, వందలాదిమందికి ఉపాధి కల్పించడానికి లభించే ఒక అద్భుతమైన సువర్ణావకాశం. గతకాలపు లోపాలను అధిగమిస్తూ, రాబోయే కాలపు భక్తుల రద్దీ అంచనాలకు తగినట్లు ముందస్తు వ్యూహాలతో అడుగులు వేయాల్సి ఉంది. ప్రభుత్వం, దేవాదాయ శాఖ, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తజనం సమన్వయంతో కదిలి,ధర్మపురిని ఒక అంతర్జాతీయస్థాయి యాత్రా కేంద్రంగా తీర్చిదిద్దగలిగితే రాబోయే 2027 గోదావరి పుష్కరాలు తెలంగాణ నూతన చరిత్రలో పవిత్రమైన, శాశ్వతమైన విజయ అధ్యాయంగా నిలిచిపోవడం ఖాయం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *