చమురు సంక్షోభంతో పొదుపు మంత్రం

– కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను తగ్గించిన ప్రధాని
– అదే బాటలో హోం మంత్రి అమిత్ షా, పలువురు సీఎంలు

న్యూదిల్లీ, మే 13: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా చమురు దిగుమతులపై ఆధారపడ్డ అనేక దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు కూడా వృథా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రధాని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని తన కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలని ఆదేశించినట్టు ఆ కథనాల సారాంశం. అంతేకాక విద్యుత్ కార్ల వినియోగాన్ని పెంచాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను 50 శాతం మేర తగ్గించాలని ప్రధాని భద్రతా దళం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపునకు (ఎస్‌పీజీ) ఆదేశాలు అందాయి. భద్రతా ప్రొటోకాల్ పాటిస్తూనే పొదుపు చర్యలు చేపట్టాలని సూచనలు వెళ్లినట్టు సమాచారం. ఈ దిశగా ఎస్‌పీజీ కార్యాచరణ మొదలెట్టినట్టు కూడా తెలుస్తోంది. తన కాన్వాయ్‌లో విద్యుత్ కార్ల సంఖ్యను పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లనే వినియోగించాలని, కొత్తవి కొనవద్దని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక హోంమంత్రి అమిత్ షా కూడా తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఇప్ప్పుడున్న కాన్వాయ్‌లో దాదాపు సగం తగ్గించారని సమాచారం. ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఈ తరహా పొదుపు చర్యలకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంధన పొదుపు కోసం ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై పలు శాఖలు సమీక్షలు జరుపుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంల కాన్వాయ్ కుదింపునకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *