– కాంగ్రెస్ అరాచకానికి నిరసనగా 2న పాదయాత్ర
– కరువు పరిస్థితులను గాలికొదిలేసి సీఎం దిల్లీ పర్యటనలా?
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ఎన్నికల వేళ ప్రజలను అసత్యాలతో నమ్మించలేక నిరాశానిస్పృహలతో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిదáండ్రులపై కాంగ్రెస్ నాయకుల దిగజారుడు పదజాలం ఆ పార్టీ దౌర్భాగ్యకర స్థితికి అద్దం పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ రాజకీయ నాయకుడు సైతం పాట్నా సభలో ప్రధాని తండ్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధానమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేక పన్నెండున్నరేళ్లుగా అధికారం కోసం తహతహలాడుతూ కాంగ్రెస్ నాయకులు నైతిక విలువలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరికి నిరసనగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఓటర్ల ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ చట్టబద్ధంగా ముగింపు దశకు చేరినా కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలను ఆపడం లేదని ధ్వజమెత్తారు. మీ సొంతూరు కొండారెడ్డిపల్లికే వస్తా.. టైం చెప్పండి.. మీ ఊరిలో ఎంతమంది అర్హులైన ఓటర్ల ఓట్లను అన్యాయంగా తొలగించారో చూపించండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. గతంలో మీ మంత్రులు విసిరిన సవాల్‌ను తాను స్వీకరించాక వారు పత్తా లేకుండా పోయారన్నారు. రాజ్యాంగబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది తప్ప ఏ ఒక్కరి ఓటును అక్రమంగా తొలగించరని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారన్న కాంగ్రెస్ ప్రచారంపై వాస్తవ గణాంకాలను రామచందర్ రావు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏఎస్‌డీడీ కింద పారదర్శకంగా పరిశీలన జరిపిందని తెలిపారు. ఈ 13 కోట్లలో సుమారు 2.8 కోట్ల మంది మరణించిన వారని, దాదాపు 3 కోట్ల మంది క్షేత్రస్థాయి పరిశీలనలో ఆయా చిరునామాల్లో అందుబాటులో లేని గైర్హాజరు (అబ్సెంట్/అన్‌ట్రేసబుల్) వారని, 6.3 కోట్ల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారని, మరో కోటిమంది పలు ప్రాంతాల్లో ఓట్లు నమోదైన వారని వివరించారు. సరైన ఆధారాలు లేకుండా ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ మంత్రులు కట్టుకథలు అల్లడం సిగ్గుచేటన్నారు. ‘సర’పై దిల్లీలో నవంబర్ 1న ర్యాలీకి హాజరవుతామన్న రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, 600కుపైగా మండలాల్లో దాదాపు 330 మండలాలు వర్షాభావం, కరువుతో అల్లాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల చెరువులకు 500 చెరువుల్లో మాత్రమే నీరు ఉందని, హైదరాబాద్ నగరంలోనే రోజుకు సుమారు ఎనిమిది వేల ట్యాంకర్ల ద్వారా ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని గుర్తు చేశారు. ప్రజలు ఇంతటి కష్టాలను ఎదుర్కొంటుంటే వాటిని పరిష్కరించడం మానేసి బాధ్యత లేకుండా రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు దిల్లీ బాట పట్టడం క్షమించరాని నేరమన్నారు. రాహుల్ నాయకత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 2008 నాటి 1182 నుంచి నేడు 660కి పడిపోగా బీజేపీ బలం 880 నుంచి 1500 పైచిలుకుకు ఎగబాకిందని వివరించారు. మార్కెట్లో విఫలమైన ఉత్పత్తిని మళ్లీ ప్రమోట్ చేయాలని చూడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ అరాచక వైఖరిని నిరసించేందుకు ‘లోక్తంత్ర బచావో-సేవ్ డెమోక్రసీ’, ‘అరాచకత హఠావో-రిమూవ్ అనార్కీ’ నినాదాలతో నవంబర్ 2న బీజేపీ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని రామచందర్ రావు వెల్లడించారు.
జీఆర్ఎంబీ అవార్డును గౌరవించాల్సిందే
కాగా, గోదావరి ఉమ్మడి నది అని, జీఆర్ఎంబీ ఇచ్చే అవార్డును రెండు తెలుగు రాష్ట్రాలు గౌరవించాల్సిందేనని రామచందర్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి (మేడిగడ్డ) బ్యారేజీ నాణ్యత లోపాలకు గత బీఆరఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణమని స్పష్టం చేశారు. ఎన్డీఎసఏ మరమ్మతులను ఎన్నడూ అడ్డుకోలేదని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా మరమ్మతులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. నీటి వివాదాల్లో జిల్లాల మధ్య చిచ్చుపెట్టి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కాంగ్రెస్ మానుకోవాలని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి, ప్రతి జిల్లాకు న్యాయబద్ధంగా నీటి వాటా దక్కేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





