– హైకోర్టులో ప్రభుత్వం నిజాయతీని నిరూపించుకోవాలి
– ప్రతి దశలో బీజేపీ అండగా నిలిచింది
– బీజేపీ నేత వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యల కారణంగానే సుప్రీంకోర్టులో వేసిన ఎస్ ఎల్‌పీ చివరికి డిస్మిస్ అయిందని బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, బీజేపీ నేత డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు విమర్శించారు. గురువారం నాంపల్లి లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన ప్రభుత్వమే, న్యాయస్థానాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం ఆందోళనకరమని అన్నారు. ఈ చర్యల కారణంగా సుప్రీంకోర్టు ద్వారాలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మూసివేసినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో నిర్దిష్ట సమాధానాలు ఇచ్చి, నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి, సుప్రీంకోర్టు తలుపులు తట్టడం ద్వారా తన అసమర్ధతను బహిర్గతం చేసుకుందని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు ప్రతి దశలో అండగా, మద్దతుగా నిలిచిన బీజేపీపై ప్రభుత్వం ఆరోపణలు చేయడం, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికేననివ్యాఖ్యానించారు. బీసీల హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రధాన ధర్మం కాగా, ఆ బాధ్యతను పక్కనబెట్టి బీజేపీపై అనవసర విమర్శలు చేయడం దారుణమన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత తొలిసారిగా జనాభా గణనలో కులగణనను చేపడుతున్న ఏకైక జాతీయ ప్రభుత్వంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్రపుటలలో నిలవతున్నదని ఆయన అన్నారు. గడిచిన 70 ఏండ్లలో సుదీర్ఘంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి ఏమీ చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ఇలాంటి పార్టీ బీజేపీని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన అన్నారు. రేవంత్ ప్రభుత్వానికి నిజంగా బీసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, 42 శాతం చట్టబద్ధంగా నిలబడటానికి కావాల్సిన అన్ని చర్యలను చేపట్టి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచనలను వెంటనే అమలు చేయాలని, హైకోర్టులో గడువులోగా అవసరమైన పత్రాలు, నివేదికలు సమర్పించాలని, పబ్లిక్ డొమైన్ లో డెడికేటెడ్ కమిషన్, సిపెక్ సర్వే నివేదిక, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ నివేదికలను వుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ప్రజాస్వామ్య విధానంలో పారదర్శకతతో ముందుకు సాగాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





