పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత‌ ప్రాధాన్యత

– దేవాదుల, ఎస్సెల్బీసీ, సీతారామలతో సమానంగా పూర్తి
– పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రణాళికలు
– జూరాలలో పూడిక తీసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతాం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేవాదుల, ఎస్.ఎల్.బి.సీ, సీతారామ ప్రాజెక్టులతో సరిసమానంగా పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సమృద్ధిగా సాగు, తాగు నీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన సుస్పష్టం చేశారు. వరాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మణాల పురోగతిపై మంగళవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పదేళ్ళ పాలనలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మరో పదిహేను రోజుల్లో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పునఃసమీక్షించనున్నట్లు వెల్లడించారు. అందుకుగాను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమగ్రమైన నివేదికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోయి నీటి నిల్వసామర్ధ్యం 8 టీఎంసీల దిగువకు పడిపోయిన జూరాల ప్రాజెక్టును ప్రస్తావిస్తూ పూడిక తీసి నీటి సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా డీఆరఐపీకు ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. డ్రిప్ కింద చేపట్టనున్న పూడికతీత పనులతో నీటి సామర్ధ్యం నిల్వలు గణనీయంగా పెరగడమేకాక రిజర్వాయర్ భద్రత, నిర్వహణ మరింత మెరుగుపరుస్తామన్నారు. అదేవిధంగా చిన్న తరహా సాగునీటి చెరువులలో వర్షా కాలానికి ముందే పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తి అయ్యాయంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరమని ఆయన తిప్పికొట్టారు. ఆ ప్రచారం ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టు ఆఫ్ టెక్‌ను జూరాల నుండి శ్రీశైలం రిజర్వాయర్‌కు మార్చడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. భూసేకరణ జరపకుండానే నాటి ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌కు టెండర్లు పిలిచి చేతులు దులుపుకున్నదని ఆయన ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి తొలి దశలో నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సహా అనుబంధంగా ప్రాజెక్టులు పూర్తి చేసి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు.  ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్, ఇ.ఎన్.సి రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *