– 20 ఏళ్ల క్రితం జూలై 4న మీరు ఇచ్చిన గెలుపుతోనే ఈ స్థాయికి చేరాను
– నాటి ‘డార్క్ మండలాన్ని’ అభివృద్ధి పథంలో నిలుపుతాం
-జడ్చర్ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, జులై 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మిడ్జిల్ మండల ప్రజలు సరిగ్గా 20 సంవత్సరాల క్రితం (జూలై 4, 2006) సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించారని, నాడు వారు నాటిన చిన్న మొక్కే నేడు తెలంగాణ రాష్ట్రానికి వృక్షమై దిశా నిర్దేశం చేసే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత భావోద్వేగంతో అన్నారు. శనివారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ రెడ్డి ఆధ్వర్యంలో మిడ్జిల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ‘ఆత్మీయ సమ్మేళనం’ భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. నాటి ప్రత్యర్థి రబ్బానికి ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇవ్వాలి. 2006లో తాను స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు, కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థిగా నిలిచిన సీనియర్ నాయకుడు రబ్బానిపై ఇక్కడి ప్రజలు తనను గెలిపించారని సీఎం గుర్తుచేసుకున్నారు. “రబ్బాని సర్పంచ్‌గా, సింగిల్ విండో చైర్మన్‌గా ఈ ప్రాంతానికి 35 ఏళ్లు సేవ చేశారు. నాటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఓడిపోయినా, ఆయన సేవలను వృథా పోనివ్వద్దు” అని వేదికపై ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు. రబ్బానికి ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన బాధ్యతను అప్పగించాలని ఆయన కోరారు. గతంలో విద్యా, వైద్యం, తాగునీరు, సాగునీరు లేక మిడ్జిల్ మరియు గట్టు మండలాలను ‘డార్క్ మండలాలు’గా ప్రకటించారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాటి చీకట్ల నుంచి వెలుగు రేఖలు చూడాలనే తపనతోనే 2006లో మిడ్జిల్ ప్రజలు చైతన్యవంతమైన నిర్ణయం తీసుకున్నారని, దానికి కృతజ్ఞతగా ఈ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకొని, ఇక్కడి అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూ. 70 వేల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని రూ. 8.21 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. తెలంగాణ అప్పులపాలైతే.. కేసీఆర్‌కు గజ్వేల్‌లో 1000 ఎకరాలు, కేటీఆర్‌కు జన్వాడలో 100 ఎకరాలు, హరీష్ రావుకు మొయినాబాద్‌లో 50 ఎకరాలు, కవితకు శంకర్ పల్లిలో 25 ఎకరాల ఫార్మ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, దళితులకు మూడెకరాల భూమి అబద్ధమైందని, లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే ‘కూలేశ్వరం’ అయిందని ఎద్దేవా చేశారు. తమది పేదల ప్రభుత్వమని, గత 30 నెలల్లో సరాసరిన నెలకు రూ. 5,600 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని సీఎం అన్నారు . మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 21,000 కోట్ల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మరియు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని, అందుకే ఈ ప్రజా పాలన నిరంతరం కొనసాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబానికి రాష్ట్ర ప్రజలు కృతజ్ఞత చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం అన్నారు. “2024 నుండి 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనే ఉంటుంది. అయితే దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీని 2029 ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేయడమే మన తదుపరి చారిత్రాత్మక అవసరం” అని ప్రకటించారు. ఈ ప్రయాణంలో 1000 మైళ్ల నడకకైనా మొదటి అడుగు మిడ్జిల్ నుంచే పడాలని, అందరూ పిడికిలి బిగించి కాంగ్రెస్‌కు అండగా నిలవాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డా. మల్లు రవి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వే నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూధన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, డా. వంశీకృష్ణ, మేఘారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నవీన్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఒబేదుల్లా కోట్పాల్, సరిత తిరుపతయ్య యాదవ్ మరియు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.





