బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం అగ్ర‌స్థానం

  • ఆధునిక రైస్ మిల్లులే భవిష్యత్తుకు బాట
  • బియ్యం ఎగుమతులు చేసే మిల్లులకు ప్రోత్సాహకాలు
  • మిర్యాలగూడలో  బందారు అగ్రోటెక్ రైస్ మిల్లు ప్రారంభం
  • ప్రారంభించిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ బియ్యం ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy ) అన్నారు. శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక బందారు అగ్రోటెక్ రైస్ మిల్లును ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని తెలిపారు. ఇకపై కేవలం ధాన్యం కొనుగోళ్లకే పరిమితం కాకుండా, నాణ్యమైన బియ్యాన్ని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బియ్యం ఎగుమతులు చేసే రైస్ మిల్లులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దీంతో మిల్లర్లు నాణ్యత పెంపు, ఆధునిక సాంకేతికత వినియోగం, బ్రాండింగ్, ఎగుమతులపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రస్తుతం సంప్రదాయ రైస్ మిల్లుల కాలం ముగుస్తోందని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన సమయం వచ్చిందని మంత్రి అన్నారు. ఆటోమేటిక్ యంత్రాలు, శాస్త్రీయ ధాన్యం ఆరబెట్టే వ్యవస్థలు, సైలోలు, నాణ్యత పరీక్షా పరికరాలు వంటి ఆధునిక సదుపాయాలతో మిల్లులను అభివృద్ధి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. “రైస్ మిల్లుల ఆధునికీకరణ ఇక ఎంపిక కాదు… కాలానుగుణ అవసరం” అని మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణలో ఉత్పత్తయ్యే బియ్యాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయడమే కాకుండా, ‘తెలంగాణ రైస్’ పేరుతో దేశవ్యాప్తంగా, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని అన్నారు. నాణ్యతతో కూడిన విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులు, మిల్లర్లు, వినియోగదారులందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ రబీ మార్కెటింగ్ సీజన్‌లో రాష్ట్రంలో ఇప్పటికే 81 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు జరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థపై రైతులు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రాసెసింగ్ సాంకేతికత, మెరుగైన నిల్వ సదుపాయాలు, పంట అనంతర నష్టాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. శాస్త్రీయ నిల్వ, సమర్థవంతమైన మిల్లింగ్, నాణ్యమైన బ్రాండింగ్ ద్వారా తెలంగాణ బియ్యానికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ఆదరణ లభిస్తుందని చెప్పారు.

మిర్యాల గూడలో అత్యాధునిక రైస్ మిల్లును ఏర్పాటు చేసిన బందారు అగ్రోటెక్ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు.  ఇటువంటి పెట్టుబడులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు రైతులు పండించే ధాన్యానికి మరింత విలువ తీసుకువస్తాయని అన్నారు. రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక రైస్ మిల్లులో 35 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల ఆరు సైలోలు ఏర్పాటు చేశారు. గంటకు 16 టన్నుల బియ్యాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ మిల్లుకు ఉంది.  జపాన్‌కు చెందిన సటాకే ఆధునిక మిల్లింగ్ టెక్నాలజీ, స్కోడా ఆటోమేషన్ వ్యవస్థ, ఫోటాన్స్ ఇండస్ట్రీస్ ధాన్యం ఆరబెట్టే వ్యవస్థ, స్పెయిన్‌కు చెందిన సిమాగా  స్టీల్ సైలోలతో ఈ మిల్లు అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడింది. రైతులకు మెరుగైన ఆదాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  నీటిపారుదల, ధాన్యం కొనుగోలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు ప్రతి దశలో రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం విధానాలు అమలు చేస్తోందని, తెలంగాణను బియ్యం రంగంలో శాశ్వత అగ్రగామిగా నిలబెడతామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *