ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలి

– ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్షే
– ధాన్యానికి కొర్రీలు.. రైతులను మోసం చేయడమే
– ఆధునిక సాగు పద్ధతులతో పండగలా వ్యవసాయం
– సిరిసిల్లలో డిప్యూటీ సీఎం భట్టి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, మే 5 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఏపీలో డిజైన్ చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీలోని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆ హోదా కల్పించకపోవడం రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనమన్నారు. ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నా ఈ ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా కొర్రీలు పెట్టడం, నిధుల విడుదలలో జాప్యం చేయడం రైతుల్ని మోసం చేయడమేనని విమర్శించారు. కేవలం కొన్ని పంటలకే మద్దతు ధర ప్రకటించి మిగిలిన వాటి విషయంలో కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని, రాష్ట్రం సేకరించిన ప్రతీ గింజను కేంద్రమే సేకరించి సకాలంలో నిధులు విడుదల చేయాలని కోరారు. వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ వరి గడ్డిని ముడిసరకుగా ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందన్నారు. సాధారణంగా పంట కోతల అనంతరం రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయడం వల్ల వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. దీనివల్ల పర్యావరణానికి రక్షణ కలగడమే కాక రైతులకు వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల బాటలో మన రైతాంగం కూడా అడుగులు వేయాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. సమాజానికి ఆహారాన్ని అందించే రైతు ఆరోగ్యకరమైన గాలిని కూడా అందించాలనే ఉద్దేశంతో పంట వ్యర్థాలను కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్‌లకు సరఫరా చేయాలని కోరారు. మరోవైపు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంట మార్పిడి విధానాన్ని రైతులు పాటించాలని కోరారు. కేవలం వరి మీదనే ఆధారపడక ఉద్యానవన పంటలు, చిరు ధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు దృష్టి సారించినప్పుడే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. వీటి సాగు వల్ల రైతులకు ఆదాయం పెరగడమే కాక సమాజానికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించిన వారవుతారని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గింజకూ కనీస మద్దతు ధర కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉందని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసిన‌ట్లు వివరించారు. ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండగలా మారుతుందని, ఈ మార్పులో రైతులు భాగస్వాములు కావాలని కోరారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం
గంభీరావుపేటలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ సమీక్ష 
పేదల ముంగిటకు పాలనను తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి గంభీరావుపేటలోని పీజీ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. అంతకుముందు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలల్లో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రూ.30.05 కోట్ల అంచనా వ్యయంతో 10 నూతన 33/11కేవీ విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన, ఒక ఉప కేంద్రం ప్రారంభోత్సవం చేశారు. సమీక్షా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. లారీల కొరతను సాకుగా చూపి ధాన్యం రవాణాను ఆపవద్దని, అవసరమైతే గ్రామాల్లో అందుబాటులో ఉండే ట్రాక్టర్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించారు. నిబంధనల కంటే రైతుల సంక్షేమమే ముఖ్యమని, దీనిపై తక్షణమే నివేదిక పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జూన్ 15 కల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మైనర్ రిపేర్లు, తాగునీరు, రన్నింగ్ వాటర్ సౌకర్యాలు పూర్తి కావాలని డిప్యూటీ సీఎం గడువు విధించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధుల కొరత లేదని, పెండింగ్‌లో ఉన్న డైట్ చార్జీలను ఇప్పటికే క్రమబద్ధీకరించామని, ఇకపై ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. సిరిసిల్ల నేతన్నల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే రూ.300 కోట్ల బకాయిలను విడుదల చేశామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.2 వరకు తగ్గించేలా ఎన్‌పీడీసీఎల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని కొనియాడారు. పదేళ్లుగా అగమ్యగోచరంగా ఉన్న రేషన్ కార్డుల పంపిణీని తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. కిలో రూ.60 విలువైన సన్న బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 52 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, లో-వోల్టేజీ సమస్యల్లేకుండా సిరిసిý్ల జిల్లాలో 11 కొత్త సబ్ స్టేషన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ పొందిన వారికి రూ.6,000 కోట్లతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నామని వివరించారు. జిల్లా యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూడాలని భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే అధికారులను గుర్తించి ప్రభుత్వం ఆవార్డులు, రివార్డులు ఇస్తుందన్నారు. పని చేయని అధికారుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.
జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉంచాలి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందు స్థానంలో ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని నియమించాలన్నారు. కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బంది రావద్దని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలి
మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కింద ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. చేనేత, వస్త్ర పరిశ్రమ కార్మికుల ఇబ్బందులు దూరం చేయాలని, వస్త్ర పరిశ్రమకు పూర్తి మద్దతుగా ఉండాలని స్పష్టం చేశారు. భూ భారతి, సాదాబైనామా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కడా సమస్య ఉండవద్దన్నారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, అందరి సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, బీడీ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేస్తామని, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. కొనుగోలు సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగితే మంత్రులకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *