నా అభిప్రాయంలో సాహిత్య ఉత్సవం ఇచ్చే గొప్ప హామీ- సాహిత్యాన్ని ఉత్సవభరితం చేయడం కాదు, దాన్ని ప్రజాస్వామీకరించడం. వీరి కథలే గొప్పవి, ఇదే సాహిత్యం అంటూ భాష, కులం, వర్గం వంటి ప్రత్యేక అవకాశాల ద్వారా కొన్ని సమూహాలు చెలాయించే ఆధిపత్యాలను బద్దలు కొట్టడం. ఇప్పటివరకు వినపడని స్వరాలను చర్చల్లోకి తీసుకురావడం, కనపడని జీవితాలను సాహిత్య మూలాల్లోకి చేర్చడం.
ఛాయా సాహిత్య ఉత్సవంలోని పేర్లు, పానెల్స్ చూస్తుంటే, అసలు సాహిత్యాన్ని ఎవరు సృష్టించవచ్చనే భావననే ‘సీఎల్ఎఫ్ 26’ విస్తృత పరుస్తుందనిపిస్తోంది. నా అంచనాలు చాలా సాదాసీదావి, కానీ హృదయపూర్వకంగా చెపుతున్నాను- రచయితలు తమకంటూ ఒక సమూహాన్ని సృష్టించుకోవాలి. భిన్నస్వరాలకి సంఘీభావం లభించాలి. ప్రశ్నకి, ఆలోచనకి భయపడే వ్యవస్థలు- విమర్శనాత్మక స్వరాలపై సెన్సార్షిప్ను తీవ్రం చేస్తున్న ఈ రోజుల్లో మనమంతా ఇక్కడ చేరి కాస్త ఆశను కూడగట్టుకోవాలని కోరుకుంటున్నాను.





