మోదీ ఆశీస్సులతో నిజామాబాద్‌కు పసుపు బోర్డు

29న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ప్రారంభం
అదేరోజు స్వర్గీయ డీఎస్‌ విగ్రహావిష్కరణ
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పసుపు పండిరచే రైతుల ఆకాంక్ష మేరకు పసుపు బోర్డు కోసం ఎంతోకాలంగా పోరాటాలు కొనసాగాయని, పలు పార్టీలు పసుపు రైతులకు పలు హామీలు ఇచ్చినా అమలు జరగలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా పసుపు బోర్డు కార్యాలయ సందర్శన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డును ప్రకటించామని, దేశవ్యాప్తంగా పసుపు బోర్డు కార్యకలాపాలకు కేంద్రంగా నిజామాబాద్‌లో కేంద్ర స్థానం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించటం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలూ తమ రాష్ట్రాల్లోనే నేషనల్‌ హెడ్‌క్వార్టర్‌ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కేంద్రం నిజామాబాద్‌కు మంజూరు చేసిందన్నారు. ఈ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రధాని నరేంద్ర మోదీ తరఫున రైతులకు అందించిన బహుమతి అని తెలిపారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా నిజామాబాద్‌కు చెందిన రైతుబిడ్డను నియమించడం అభినందనీయమన్నారు. ఈనెల 29న హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమవుతుందని, ఆ తర్వాత బోర్డు లోగోను ఆవిష్కరించి రైతు సభలో ప్రసంగిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవానికి బీజేపీ తరఫున నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు హాజరుకానున్నారని చెప్పారు. ఈ జిల్లా ఎన్నో ఏళ్లుగా రైతు ఉద్యమాలకు కేంద్రబిందువుగా నిలిచిందని, ఇది రైతు చైతన్యానికి ప్రతీక అని, గ్రామగ్రామాన రాజకీయాలకతీతంగా రైతులు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యలపై పోరాడుతున్నాని చెప్పారు. స్థానిక నాయకులు, ఎంపీల కోరిక మేరకు కేంద్రం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత రైతులకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ బోర్డు ద్వారా ప్రతి రైతుకు ప్రయోజనం కలగాలన్న దృష్టితో రైతులంతా సమన్వయంతో కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. బోర్డు ప్రారంభం అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అమిత్‌ షాతో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కలిసి తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారని తెలిపారు. పసుపు ధరలు పెరిగేలా, వ్యాల్యూ యాడెడ్‌ ఉత్పత్తుల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు గౌరవం పెరగాలన్నదే ఉద్దేశమన్నారు. ఈ జిల్లాకు చెందిన నేత డి.శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, వారి జీవితంలో చివరి దశలో బిజెపికి దగ్గరయ్యారని, ఆయన ప్రథమ వర్థంతి ఈనెల 29న జరగనుందని, ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ ధర్మపురి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాని అభ్యర్థించారని కిషన్‌రెడ్డి తెలిపారు. అమిత్‌ షా గఈ అభ్యర్థనను పెద్ద మనసుతో అంగీకరించారని, రైతు సభకు వెళ్లే క్రమంలో డి.శ్రీనివాస్‌ విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page