– పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులు
– పిండ ప్రదానాలు, నది హారతి
– ఉచిత అన్నదాన కార్యక్రమాలు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 28 : కాళేశ్వరంలోని త్రివేణి సంగమం కేంద్రంగా సాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చి నది పుష్కర స్నాన మాచరిస్తున్నారు. త్రివేణి సంఘంలో పితృదేవతలకు పురుషులు పిండ ప్రదానాలు చేయగా మహిళలు నది హారతులు సమర్పిస్తున్నారు. ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో కాశీ నుండి విచ్చేసిన పండితులచే కర్పూర హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాశీ పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి కర్పూర గౌర హారతి సమర్పించగా, ఆలయ ప్రాంగణం భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ఈ హారతి కార్యక్రమం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. వేదఘోషలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు, అర్చకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, శ్రద్ధతో కూడిన క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు వంటి అన్ని సదుపాయాలను ఆలయ అధికారులు సమర్థవంతంగా కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, భక్తులు క్రమశిక్షణతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని సూచించారు. భక్తులు శాంతి భద్రతలను పాటిస్తూ పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక వైభవం మరింత వెలుగొందిందని, భక్తులలో భక్తి భావం మరింత పెంపొందిందని అధికారులు పేర్కొన్నారు. అనంతరం పూజారులు ఫనీంద్ర శర్మ కాశీ పండితులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. 
భక్తులకు అన్నదాన కార్యక్రమం
పుష్కరాలకు విచ్చేసిన భక్తుల కోసం దేవాలయం ఆధ్వర్యంలో అన్నదాన సత్రం వద్ద ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పుష్కర స్నానాల అనంతరం భక్తులు ఆహార సమస్యలు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి రోజు భక్తులకు పరి శుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారు. దేవస్థానం సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో అన్నదానం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానంలో పరిశుభ్రత, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈఓ మహేష్ సూచించారు.సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





