– గిరిజన సమాజం సమస్యలను పరిష్కరించాలి
– గిరిజన సమస్యలు, అభివృద్ధిపై సదస్సులో రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : గిరిజన జనాభా తగ్గుదల, జీవన విధానంలో వస్తున్న మార్పులు, సంప్రదాయ ఆవాసాల అంతరించిపోవడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. గిరిజన సమాజ సమస్యలు, అభివృద్ధిపై ఉస్మానియా వర్సిటీలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గిరిజన సమాజానికి సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అనేక గిరిజన గ్రామాలు, గూడేలు, పెంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, అయితే ఈ పథకాల ఫలితాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందాలంటే మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈరోజు అత్యంత కీలక సమస్యల్లో భూమి సమస్య ఒకటని, ముఖ్యంగా పోడు భూముల సమస్య ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అనేక వేదికల్లో, శాసనమండలిలో కూడా చర్చించినప్పటికీ శాశ్వత పరిష్కారం ఇంకా లభించలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల భూ హక్కుల సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందన్నారు. వారి భూ హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ అవి సమర్థవంతంగా పనిచేయడం లేదని తెలిపారు. శుద్ధమైన తాగునీటి లభ్యత లేకపోవడం, పోషకాహార లోపం, ఆరోగ్య అవగాహన లేమి వంటి కారణాలతో గిరిజన ప్రాంతాల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రామచందర్‌రావు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. గిరిజన ప్రాంతాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని ప్రధాన స్రవంతిలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధితోపాటు వారి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ప్రత్యేక గుర్తింపును కూడా పరిరక్షించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం అమలుకు సంబంధించి ఇప్పటికీ అనేక సమస్యలు కొనసాగుతున్నాయంటూ భూమి కొనుగోలు, అమ్మకాలు, భూ హక్కుల పరిరక్షణ, గిరిజన భూములపై అక్రమ ఆక్రమణలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బంజారా, నోమాడిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ వంటి వర్గాల సమస్యలను కూడా గుర్తించి వారికి అవసరమైన రక్షణ, అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


