హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: కానిస్టేబుల్ నుండి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఫీల్డ్ పోలీసు అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ట్రాక్ శిక్షణ కార్యక్రమం బుధవారం విజయవంతంగా ముగిసింది. కాల్ డీటైల్ రికార్డులు (సీడీఆర్), ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డులు (ఐపీడీఆర్), టవర్ డంప్ విశ్లేషణ, సోషల్ మీడియా ప్రొఫైలింగ్, డిజిటల్ ఫుట్‌ప్రింట్ అనాలిసిస్ వంటి అంశాలపై శిక్షణను పోలీస్ అకాడమీలో నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం సైబర్ నేరాల దర్యాప్తులో ఫీల్డ్ అధికారుల సామర్థ్యాలను పెంపొందించేందుకు రూపొందించారు. ముఖ్యంగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు ఆధునిక సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా విశ్లేషించి నేరాలను ఛేదించేందుకు అవసరమైన నైపుణ్యాలను ఈ పొందుతున్నారు. ఈ 5వ బ్యాచ్‌లో మొత్తం 31 మంది శిక్షణ పొందగా వీరిలో ఒక ఇన్‌స్పెక్టర్, ఆరుగురు ఎసఐలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ముగింపు కార్యక్రమాన్ని కోర్సు డైరెక్టర్ వి.భాస్కర్, కోఆర్డినేటర్, సైబర్ నిపుణుడు ప్రగతి రతన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, సోషల్ మీడియా ఆధారిత నేరాలు, వైట్ కాలర్ క్రైమ్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసుల దర్యాప్తులో డిజిటల్ ఆధారాల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. శిక్షణ పొందిన అధికారులు తమ యూనిట్లలో నేరాల దర్యాప్తును మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని పేర్కొన్నారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ మార్గదర్శకత్వంలో ప్రతి నెలా ఇలాంటి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు తమ ఫీల్డ్ సిబ్బందిని ఈ కోర్సులకు పంపి ఆధునిక సైబర్ దర్యాప్తు పద్ధతులపై శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని భాస్కర్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





