– ఇప్పట్లో తగ్గించే ఉద్దేశం లేదన్న కేంద్రం
న్యూదిల్లీ, జూన్ 18:అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగిరానున్నాయి. అయినా భారత్‌లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి ఇటీవల ఇంధన ధరలు పెంచడంపై గురువారం మాట్లాడారు. లీటరుకు దాదాపు రూ.3.94 మాత్రమే పెంచామన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన ఆ పెంపును వెంటనే తగ్గించలేమన్నారు. హొర్మూజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్‌కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. ఇలా పలు అంశాల వల్ల ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని స్పష్టం చేశారు. ఇక, పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలోని చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ సమయంలో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదని కేంద్ర మంత్రి అన్నారు. దీంతో ఆ భారమంతా కేంద్రంపై పడిందని, ఈ కారణంగా కేంద్రం రూ.12వేల కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





