లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయ్‌

హెచ్‌సీయూ భూములపై రామేశ్వరరావు కన్ను
ఆనాడు కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని యూనివర్సిటీల భూములపై సర్వే వేయించి కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవించానని తెలిపారు. లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయన్నారు. హెచ్‌సీయూ కోసం ఇందిరా గాంధీ 2500 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. కేటీఆర్‌కిషన్‌ రెడ్డి  చేతిలో చెయ్యేసి చెప్పు బావ అనే లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రామేశ్వర రావు కన్ను హెచ్‌సీయూ భూములపై పడిందన్నారు. కోర్టులో ఉన్న కారణంగా భూములను కొల్లగొట్టలేకపోయారని తెలిపారు. హెచ్‌సీయూ అన్యాక్రాంత భూముల్లో మై హోం విహంగ భవనం వెలిసిందంటూ వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీయూ భూముల్లో మైహోం భవనాలు కట్టారని… అప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో అక్కడ రోడ్లు వేశారని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‌ బినామీలకు భూములు ఇచ్చేపుడు వన్య ప్రాణులు కనపడలేదా అని నిలదీశారు. 534 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నందుకు గోపనపల్లి లో 397 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించారని తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టి కేటీఆర్‌ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టింది బీఆర్‌ఎస్‌ నాయకులే అంటూ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్‌ మాట్లాడుతూ.. క్యాబినెట్‌ విస్తరణపై అభిప్రాయాలు చెప్పామన్నారు. అధిస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తాముఇప్పటి వరకు ఎలాంటి తేదీలు చెప్పలేదని తెలిపారు. సాయంత్రం దిల్లీకి వెళ్తున్నామని.. బీసీ సంఘాల నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page