- హెచ్ సీయూ భూముల్లో జింకలను, నెమళ్లను చంపుతున్నారు.
- విద్యార్థుల పోరాటానికి అండగా నిలుస్తాం..
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణలో భూములను అమ్ముకొని దిల్లీకి కప్పం కట్టే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోందని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ మండిపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులందరం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశామని తెలిపారు. 1969 లో 369 మంది ముద్దుబిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేస్తే… ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదు.. కానీ అనేక గ్యారంటీలలో భాగంగా హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది. దాదాపు 2500 ఎకరాల భూమిని నాడు నగరానికి దూరంగా ఇస్తే నేడు అది గొప్ప విశ్వవిద్యాలయంగా వర్ధిల్లుతోంది. పదేళ్లలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచినప్పుడు కూడా ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి, పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. 700 రకాల పైచిలుకు జీవులు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి… మెడికల్ ప్లాంట్స్ ఉన్నాయి.
పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ఆస్కారం ఉందని ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు విశ్వవిద్యాలయం భూమిని ఎవరికి ధారాదత్తం చేయవద్దని తీర్పు ఇచ్చింది. రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను, నెమలను చంపి, మెడిసిన్ ప్లాంట్స్ పీకేసి కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపై ధర్మేంద్ర ప్రధాన్ ని కలిశాం. పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా కలుస్తాం. దీనిమీద నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల కోసం భూములు అమ్మట్లేదు. 400 ఎకరాల భూమి విలువ 40 వేల కోట్లు రూపాయలు. ఆ భూములు అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్లలో మట్టి కొడతానంటే చూస్తూ ఊరుకోబోమని ఎంపీ ఈటల హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని అంటే హౌస్ అరెస్ట్ చేశారు. విద్యార్థులంతా కూడా ఉద్యమాలు చేస్తుంటే గోడ్డును కొట్టినట్టు కొట్టడమే కాకుండా మహిళా విద్యార్థులని చూడకుండా వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకు వెళుతున్నారు. పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు, కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. కేసులు, అరెస్టులు విద్యార్థుల శక్తిని ఆపలేవు. వాళ్లకు తోడుగా భారతీయ జనతా పార్టీ ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి హామీ
ఎట్టి పరిస్థితుల్లో హెచ్ సీయూ భూములను అమ్మనివ్వమని, అవి ఆపడానికి ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తానని కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారని ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. దీనికోసం తెలంగాణ పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తాం. మా విద్యార్థులను హింసిస్తున్న కేసు పెడుతున్న దానిని మేము పూర్తిస్థాయిలో ఖండిస్తున్నామని చెప్పారు. తక్షణమే పోలీసులు, బుల్డోజర్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ భూమిని 2004లో వేరే కంపెనీకి డాక్యుమెంట్ చేసిన నాడు కూడా వ్యతిరేకత వొచ్చింది. 2006 లో రద్దు చేసుకున్నది. 400 ఎకరాల భూమిని ఐఎంజీ కోసం ఇచ్చాయో దాన్ని ఆనాటి ప్రభుత్వమే 2006లో రద్దు చేసుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటంలో ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీది మాత్రమే అని చెప్పి, పర్యావరణం దెబ్బతింటుందని అమ్ముకోవడమే కాదని, విశ్వవిద్యాలయ భూములు కాపాడుకోవాలని మాత్రమే తీర్పు వచ్చిందన్నారు.