జీవవైవిధ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
: ఎంతో ప్రాధాన్యత కలిగిన హెచ్ సీయూ భూముల ఆక్రమణను వెంటనే నిలిపివేసి, అక్కడి పర్యావరణ పరిరక్షణ పై అధ్యయనం చేయడానికి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. మంగళవారం హెచ్ సీయూ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమిలో తెలంగాణ ప్రభుత్వం టిజిఐఐసి ద్వారా పెద్ద ఎత్తున జేసీబీలను మోహరించి చేపట్టిన ఆక్రమణ పనులను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, ధర్మపురి అరవింద్, గొడం నగేష్ ఉన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ఎంపీలందరితో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ని కలిశాం. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి విజిటర్‌గా ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థ .. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రస్తుతం స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటోందని.. ఇలాంటి సమయంలో భవిష్యత్ తరాల కోసం అవసరమైన పచ్చని వాతావరణం, అభివృద్ధి పనులకు, పరిశోధనలకు, యూనివర్సిటీ విస్తరణకు భూములు అవసరమని అన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ టిజిఐఐసి చేసిన ప్రకటనను తప్పుపడుతూ హెచ్ సీయూ రిజిస్ట్రార్ మార్చి 31న ప్రకటన చేశారు.ఈ భూములకు సంబంధించి ఇంత వరకు ఎటువంటి సర్వే జరగలేదని, ఎటువంటి సరిహద్దులు నిర్ణయించలేదని, ఈ ప్రాంతంలో ఉన్న పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని సంరక్షించటానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని రిజిస్ట్రార్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
యూనివర్శిటీకి కేటాయించిన భూముల బదలాయింపునకు కూడా రాష్ట్రపతి చేత ఆరుగురు సభ్యులచే నియమించబడిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని కూడా రిజిస్ట్రార్ తన ప్రకటనలో తెలియజేశారు. ఈ భూముల వేలం ప్రక్రియను రద్దు చేయాలని వేసిన పిటిషన్ కు మద్దతుగా 22,000 మందికి పైగా ప్రజలు సంతకాలు చేశారు. హెచ్ సీయూ రిజిస్ట్రార్ మొదలుకొని అనేకమంది పర్యావరణ, జంతు ప్రేమికులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, అధ్యాపకులు, సమీప నివాసితులు పదే పదే విజ్ఞప్తి చేసినా వినకుండా, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూములను చదును చేయడానికి పదుల సంఖ్యలో జేసీబీలను మొహరించి అర్ధరాత్రుళ్లు కూడా వదలకుండా గత రెండు రోజులుగా ఆక్రమణ పనులను చేపడుతుండటం అత్యంత దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆక్రమణ పనులను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న వందలాది మంది యూనివర్శిటీ విద్యార్థుల మీద అమానుషంగా లాఠీఛార్జి చేసి, అక్రమంగా అరెస్టులు చేసి కేసులు బనాయించడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆక్రమణ పనుల వల్ల ఆ ప్రాంతంలో ఉండే.. నెమళ్లు, జింకలు ఇతర జంతువుల ఆర్తనాదాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ చూశారు.
చుట్టూ పచ్చని చెట్లు, పెద్ద సంఖ్యలో జంతువులు, పక్షులు, నక్షత్ర తాబేళ్ళ(IUCN – ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్‌లో అరుదైన జాబితాలో ఉన్నాయి)తో జీవవైవిధ్యానికి నెలవైన పర్యావరణాన్ని సంరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగడం చాలా దారుణం. అంతేకాకుండా గోడవర్మన్ తిరుమలపాడ్ కేసులో(1996) సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో అటవీ సంరక్షణ చట్టం, 1980 ప్రకారం ప్రైవేటు భూమితో సహా.. అటవీ వాతావరణాన్ని కలిగి ఉన్న ఏ భూమినైనా అటవీ భూమిగానే పరిగణించవచ్చని, అలాంటి భూమిలో చెట్ల నరికివేత పనులు చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంది. దీని ఆధారంగా పెద్ద సంఖ్యలో పచ్చని చెట్లకు, జీవవైవిధ్యానికి నెలవై ఉన్న ఈ 400 ఎకరాల భూములను కూడా అటవీ భూములే.. ఏమాత్రం సందేహం అక్కర్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.