ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులు రూ.180 కోట్లు విడుదల

– 3,008 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు లబ్ది

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులు రూ.179.90 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను త విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిధుల విడుదలతో విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న మొత్తం 3,008మందికి భారీ ఆర్థిక ఊరట లభించిందని, స్కాలర్‌షిప్ మంజూరైన లబ్దిదారులందరికీ చెల్లింపులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నిధుల కేటాయింపుల్లో భాగంగా ఎస్సీ వర్గానికి చెందిన 1,193మంది విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద రూ.48.42 కోట్లు విడుదలయ్యాయి. అలాగే ఎస్టీ వర్గానికి చెందిన 573మందికి రూ.36.95 కోట్లు, బీసీ సామాజికవర్గానికి చెందిన 179 మంది విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి కింద రూ.18.41 కోట్లు మంజూరు చేశారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన 1,063మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ విద్యా నిధి కింద రూ.76.13 కోట్లను విడుదల చేశారు. పేద, ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అంతర్జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువులు అభ్యసించాలనే దృఢ సంకల్పంతోనే ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *