గ్రామీణ రోడ్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత

– హ్యామ్ రోడ్ల పనులను వేగవంతం చేయాలి
– నాణ్యతలో రాజీ పడొద్దు
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులకు స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ఇన్‌స్టిట్యూషనల్ స్ట్రెంగ్తెనింగ్ ప్రోగ్రామ్‌కు ఆమె హాజరయ్యారు. హామ్ రోడ్ల విధానంలో టెక్నికల్ షెడ్యూల్, పనుల పరిధి, సాంకేతిక బాధ్యతలు, ఇతర విధివిధానాలపై ఫీల్డ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పాల్గొని రహదారుల అభివృద్ధి పనుల పురోగతి, లక్ష్యాలు, అమలు తీరుపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,448 కి.మీకు పైగా హామ్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, ఆయన నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణంలో ప్రతి రోజూ విలువైనదేనని, సమయం వృథా కాకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ప్రజల ప్రాణాలు కాపాడటంలో రోడ్ల పాత్ర కీలకం

రహదారులు ప్రయాణ సౌకర్యాలు మాత్రమే కాదని, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నాయంటూ అత్యవసర సమయంలో అంబులెన్స్ హాస్పిటల్‌కి చేరాలన్నా, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందాలన్నా రహదారులు ఎంతో అవసరమని మంత్రి సీతక్క వివరించారు. గ్రామాల్లో రోడ్ల సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు అక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. పరిశ్రమలు స్థాపించాలన్నా, పెట్టుబడులు రావాలన్నా రవాణా సౌకర్యాలు కీలకమని తెలిపారు. రహదారుల అనుసంధానమే ప్రాంతాల అభివృద్ధికి పŸÚనాది అని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంలో వేగంతోపాటు నాణ్యతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పనులు చేపట్టే ఏజెన్సీలతో అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు. అక్టోబర్ నుంచి జూన్ వరకు పనులు చేపట్టేందుకు అనువైన సమయమంటూ ఈ కాలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. లక్ష్యాలను నిర్దేశించుని సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయాలన్నారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలన్నారు. గ్రామాల్లోనే కుటుంబాలు గౌరవంగా, సౌకర్యవంతంగా జీవించే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఇంజనీరింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని, తాము నిర్మించిన రోడ్డు, కట్టించిన భవనం చూసినప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనిచేశామనే సంతృప్తి ప్రతి ఉద్యోగికి కలగాలని సూచించారు. పంచాయతీ భవనాల నిర్మాణంతోపాటు ఇందిరా మహిళా శక్తి, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ల విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టులను రద్దు చేసి ఇతర ఏజెన్సీలకు పనులు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్, ఈఎన్‌సీ జగదీశ్వర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *