– కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
న్యూదిల్లీ, అక్టోబర్ 13 : వారం రోజులుగా దిల్లీలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరసనల పేరిట నాటకాలు ఆడుతున్నాయని, వాటిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య హక్కులను దుర్వినియోగం చేస్తూ దేశంలో అరాచకం సృష్టించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. గతంలో లోక్సభ స్పీకర్, సీఈసీ రాజీనామాలు కోరిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి, హోంమంత్రి, ఆరఎసఎస్ చీఫ్లను టార్గెట్ చేశామని అనడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. తమకు అనుకూలంగా తీర్పులు రాకపోతే సుప్రీంకోర్టు సీజేఐ కూడా గద్దె దిగాలని అనడం సిగ్గుచేటని మండిపడ్డారు.
వోట్ల తొలగింపుపై స్పష్టత
వోటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(’సర’) ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా చనిపోయిన 2.8 కోట్ల మంది, నివాసం మారిన 6.3 కోట్ల మంది, డూప్లికేట్ వోట్లు కలిగిన కోటిమంది వివరాలను నిబంధనల ప్రకారమే తొలగించినట్లు కిషన్రెడ్డి స్పష్టం చేశారు. స్థానికంగా ఈ తప్పులను సరిదిద్దేందుకు ప్రతి పోలింగ్ బూత్లో కాంగ్రెస్ బీఎలఏలకు అవకాశం ఉన్నప్పటికీ వారు దాన్ని ఉపయోగించుకోకుండా దిల్లీలో ఊరేగింపులు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తెలంగాణలో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులే అన్న విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ వైఫల్యాలు – ద్వంద్వ వైఖరి
ఇటీవల గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపురలలో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని కిషన్ రెడ్డి నిలదీశారు. గత 15 ఏళ్లుగా ప్రజామద్దతు లేక ఓడిపోతున్న కాంగ్రెస్ ఇప్పుడు ఓటమికి సీఈసీ, సీజేఐలను బాధ్యులను చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేరళలో సర్ ద్వారా బోగస్ వోట్లు తొలగించారని మెచ్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్రెడ్డి ద్వంద్వ నీతి
దిల్లీలో వారం రోజులుగా కాంగ్రెస్ ధర్నాల వల్ల వ్యాపారాలు దెబ్బతిని పండుగల సీజన్లో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ నిరసనలకు అనుమతి ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేసే రేవంత్ రెడ్డి దిల్లీకి వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





