– ఎల్‌నినో ప్రభావం ఉన్నా నీటి ఎద్దడి రానివ్వం
– పక్కాగా ముందస్తు కార్యాచరణ అమలు
– 23న సింగూరు రిజర్వాయర్‌పై ప్రత్యేక సమావేశం
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా రాష్ట్రంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. మంచినీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ఎర్రమంజిల్‌లోని గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క శనివారం సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్ల వారీగా నీటి నిల్వలు, ప్రస్తుత తాగునీటి సరఫరా పరిస్థితులు, ్న వేసవిలో ఎదురయ్యే అవసరాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తాగునీటికే మొదటి ప్రాధాన్యత
నవంబర్ 1 లోపు సాగునీటి అవసరాలు తీరిన అనంతరం రిజర్వాయర్లలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి చేరినా సరఫరాకు ఆటంకం కలగకుండా అత్యవసర పంపులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన పంపులను సమీకరించి కనీసం వంద పంపులను అందుబాటులో ఉంచాలని, పనిచేయని పంపులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.
గ్రామస్థాయి నుంచే వేసవి కార్యాచరణ
రానున్న యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకు ప్రాధాన్యతనిచ్చేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. నవంబర్ మొదటి వారంలో జిల్లా కలెక్టర్లతో కలిసి గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు సమీక్షలు నిర్వహించి వేసవి కార్యాచరణను వేగవంతం చేయాలన్నారు. రెండో వారంలో మండల స్థాయిలో తాగునీటి అవసరాలపై అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, ప్రతి ఆవాస ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని హ్యాబిటేషన్ల వారీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, స్థానికంగా అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను ముందుగానే గుర్తించి వినియోగానికి సిద్ధం చేయాలని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు బోర్వెల్ రీచార్జ్ పనులను పూర్తి చేయాలని, అవసరమైనచోట చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పైప్‌లైన్ లీకేజీలపై నిర్లక్ష్యం వద్దు
అందుబాటులో ఉన్న నీటిని ప్రతి చుక్కా విలువైనదిగా భావించి పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. పైప్లైన్లలో లీకేజీలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఇతర శాఖలు రోడ్డు మరమ్మతులు, నిర్మాణ పనులు చేపట్టే సమయంలో తాగునీటి పైప్లైన్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల కారణంగా పైప్లైన్లు దెబ్బతింటే సంబంధిత శాఖలే బాధ్యత వహించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైప్లైన్లు దెబ్బతిన్న సందర్భాల్లో వెంటనే మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్వహణ, పైప్‌లైన్ మరమ్మతులకు అవసరమైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం వీబీ జీ రామ్ జీ నిధులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
అత్యవసర నిధులతో తక్షణ చర్యలు
తాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాల్లో ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉన్న అత్యవసర నిధులతోపాటు ఎస్డీఎఫ్ నిధులను కూడా నిబంధనల ప్రకారం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించేలా అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
సింగూరు ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక సమీక్ష
సింగూరు రిజర్వాయర్ మినహా ఇతర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. సింగూరు రిజర్వాయర్‌పై ఆధారపడిన జిల్లాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికలు, నీటి వనరుల సమర్థ వినియోగం, నిరంతర పర్యవేక్షణతో రానున్న వేసవిలోనూ ప్రజలకు మంచినీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, వివిధ స్థాయిల చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





