సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 4: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో ఇటీవల జరిగిన దుర్ఘటనలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 39కి చేరింది. సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్‌రావు అనే వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భీవమ్‌రావ్ స్వస్థలం మహారాష్ట్ర. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ప్రమాద స్థలిలో ఐదవ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఇప్పటివరకు 31 మృతదేహాలను గుర్తించామని, ఇంకా 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 12 మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం ఆస్పత్రులలో 23 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. అలాగే ఇంకా తొమ్మిదిమంది ఆచూకీ లభించలేదని కలెక్టర్ ప్రకటించారు. వీరి కోసం ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. సిగాచి పరిశ్రమ వద్ద బాధితుల ఆందోళన కొనసాగుతోంది. ఐదు రోజులు గడిచినప్పటికీ తమ వారి ఆచూకీ తెలియడం లేదంటూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితోపాటు ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళంకు చెందిన ఓ కుటుంబం కూడా నిరీక్షిస్తోంది.
హైలెవెల్ కమిటీ పరిశీలన
సిగాచి ప్రమాద ఘటనా స్థలిని సీఎస్ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ పరిశీలించింది. కమిటీకి చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణా రావు, సభ్యులుగా రెవెన్యూ, ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీలతోపాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ డీజీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన తర్వాత బాధిత కుటుంబాలతో కమిటీ మాట్లాడనుంది. సిగాచి యాజమాన్యంతో కూడా మాట్లాడి వివరాలను సేకరించనుంది. ఇక ప్రమాద స్థలిని నిపుణుల కమిటీ గురువారం పరిశీలించి సుమారు మూడు నాలుగు గంటలపాటు అక్కడివారిని విచారించింది. టెక్నికల్ అంశాలపై ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.