– అప్పుడే సుస్థిర మైనింగ్ సాధ్యం
– వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరం అని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సును మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. బొగ్గు, గనుల రంగం ఆత్మనిర్భరత సాధించాలంటే ప్రపంచస్థాయి ఆలోచనల అమలు అవసరమని, ప్రకృతిని, ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తేనే సుస్థిర మైనింగ్ సాధ్యమని అన్నారు. బొగ్గు, ఇతర మినరల్స్ ఉత్పత్తి, ప్రజాసంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికతకు ప్రోత్సాహం అందించడం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలని తెలిపారు. ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో బాధ్యతాయుతంగా మైన్ క్లోజర్‌పై దృష్టిపెట్టడం కూడా చాలా కీలకం అని, ఇందుకోసం సింగిల్ విండో సిస్టం తీసుకొచ్చామని, త్వరగా అనుమతులు మంజూరు చేస్తున్నామని వివరించారు. గనులకు భూములు ఇస్తున్న వారికి అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు మోదీ సర్కారు కృషిచేస్తోందన్నారు. ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం.. పరిశోధనలకు అధునాతన సాంకేతికతను ప్రోత్సహిస్తున్నాం.. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ ద్వారా ఎక్స్‌ప్లొరేషన్‌ను మరింతగా ప్రోత్సహిస్తున్నాం.. ప్రైవేట్ సంస్థలను కూడా ఎక్స్‌ప్లొరేషన్ చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇందుకోసం కోల్ గ్యాసిఫికేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ డైవర్సిఫికేషన్, పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, తవ్వకం పూర్తయిన గనుల రీఫర్నిషింగ్ వంట ివాటిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కిషన్‌రెడ్డి చెప్పారు.