అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
36కు పెరిగిన మృతుల సంఖ్య
మృతదేహాలకు పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్ డాక్టర్ల బృందాన్ని పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి పంపారు. డీఎన్‌ఏ పరీక్షలు చేసేందుకు పోస్టుమార్టం వైద్యులకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం సహకరిస్తోంది. మృతదేహాల తరలింపునకు ప్రత్యేకంగా పది అంబులెన్స్‌ల ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఘోర విపత్తుకు సంబంధించి నిపుణులతో కలిసి సమగ్ర నివేదిక (డీటెయిల్డ్ రిపోర్ట్) సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో ఈ ఉదయం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఘటనా స్థలి పరిశీలనకు వెళ్లారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలన్నారు. సహాయక చర్యలకు సంబంధించి విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా అందించాలన్నారు. ఇది నష్టపరిహారం కాదని, తక్షణ సాయం మాత్రమే అని అధికారులకు స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఖర్చులకు వెనకాడవద్దని, అవసరమైతే ప్రభుత్వమే వారి వైద్యానికి అయ్యే ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉందన్న సీఎం మృతుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదివించేలా చూడాలని తెలిపారు.