ఇలాంటి ఘటన ఇంతకుముందెన్నడూ జరగలేదు
పాశమైలారం ఘటనాస్థలి వద్ద మీడియాతో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1: సపంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమైనదని, ఇప్పటివరకు ఇంతటి దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఘటనా స్థలిని మంగళవారం ఉదయం పలువురు మంత్రులు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఇప్పటివరకు 36మంది చనిపోయారన్నారు. ప్రమాద సమయంలో కర్మాగారంలో 143 మంది ఉన్నారని, 58మందిని అధికారులు గుర్తించగా మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించా మన్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తామని వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కంపెనీల్లో తరచూ తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు.
ఘటనాస్థలిలో అధికారులతో సీఎం సమీక్ష
సోమవారం భారీ పేలుడు సంభవించి 36మంది మృతిచెందిన సిగాచీ రసాయన పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్‌లతో కలిసి పరిశీలించారు. ఘటనాస్థలిలోనే అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఘటనకు గల కారణాలు, సహాయక చర్యలు, మృతుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఘటనాస్థలి నుంచి పటాన్‌చెరులోని ఆసుపత్రికి చేరుకుని చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితులకు అందుతున్న చికిత్స, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు.